నిర్మల్ గడ్డ నుంచే తెలంగాణ ఉద్యమానికి బీజం!
తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిర్మల్ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమానికి నిర్మల్ గడ్డతో విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు. నిర్మల్లో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. 1996లో నిర్మల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన సమయంలో కేసీఆర్ మంత్రిగా ఎన్నికల ఇన్చార్జ్గా ఇక్కడికి వచ్చారని తెలిపారు.
ఆ సమయంలో మధ్యలో రెండు గంటల సమయం దొరకడంతో తన మిత్రులతో కలిసి పోచంపాడు ప్రాజెక్టును సందర్శించారని కేటీఆర్ వివరించారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు, ఆయిలింగ్ లేక తుప్పు పట్టిపోయి దయనీయ స్థితిలో ఉండటాన్ని చూసి కేసీఆర్ చలించిపోయారని చెప్పారు. ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురై అనాథలా మారిపోయిన పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
అదే సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులు శివాలయాల్లా నిర్లక్ష్యానికి గురవుతుంటే.. ఆంధ్రాకు నీటిని తరలించే ప్రాజెక్టులు మాత్రం వైష్ణవ ఆలయాల్లా కళకళలాడుతున్నాయని కేసీఆర్ అన్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు మంచి రోజులు రావాలంటే అవసరమైతే ఉద్యమానికి శ్రీకారం చుడతానని, భగవంతుడు శక్తినిస్తే తెలంగాణను సాధిస్తానని కేసీఆర్ అప్పుడే ప్రకటించారని వివరించారు.
తెలంగాణ ఉద్యమానికి బీజం పడిన తొలి ప్రాంతాల్లో నిర్మల్ గడ్డ కూడా ఒకటని, కేసీఆర్ ఉద్యమ ప్రస్థానంలో ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని కేటీఆర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.