ఇస్రో బాహుబాలి ప్రయోగం విజయవంతం
ISRO LVM3 Launch: : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇస్రో చేపట్టిన బాహుబలి రాకెట్ ఎల్వీఎం3-ఎం6 ప్రయోగం విజయవంతం అయింది. బుధవారం ఉదయం 8.45 గంటలకు ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC- షార్) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో ఈ బాహుబలి రాకెట్ LVM3-M6 (లాంచ్ వెహికల్ మార్క్-3 M6)ను విజయవంతంగా ప్రయోగించింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను రాకెట్ మోసుకెళ్లింది. 15 నిమిషాల్లో మూడు దశల్లో రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు, అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మొబైల్ బ్రాండ్ బ్యాండ్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో రానున్నాయి. బ్లూబర్డ్ శ్రేణి ఉపగ్రహం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నేరుగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరిస్తారు. గతంలో పంపిన శాటిలైట్ల కంటే ఈ శాటిలైట్ పదిరెట్ల అధిక సామర్ధ్యంతో పని చేస్తుంది. ఇస్రో చేపడుతున్న వందో ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, అంతరిక్ష రంగ నిపుణుల్లో ఈ ప్రయోగం పై విశేష ఆసక్తి చూపించారు. రాకెట్ ప్రయోగం నేపథ్యంలో షార్ లో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.