బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కల్లోలం

-విద్యార్థులకు నరకం చూపిస్తున్న కలుషిత జలాలు
-ఒంటి నిండా దురదలు, దద్దుర్లు... అయినా స్పందించని అధికారులు
-రక్షిత నీరు అడిగితే సస్పెన్షన్ బెదిరింపులా..?
-ట్రిపుల్ ఐటీ అధికారుల తీరుపై భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
-జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని విజ్ఞ‌ప్తి

అక్షరాల వెలుగులు పంచాల్సిన బాసర ట్రిపుల్ ఐటీలో… ఇప్పుడు అనారోగ్య చీకట్లు అలుముకున్నాయి. విద్యార్థుల పాలిట ఆ క్యాంపస్ నరకంగా మారింది. కారణం.. కలుషిత నీరు. అవును, మీరు వింటున్నది నిజమే. బురద, మురికితో కూడిన నీరు కుళాయిల నుంచి వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. సురక్షితమైన నీరు అందించాల్సిన బాధ్యతను విస్మరించిన అధికారులు… విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

నిర్మల్ జిల్లాలోని ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగు రోజులుగా పరిస్థితి దారుణంగా మారింది. కుళాయిల నుంచి వస్తున్న మడ్డి, మట్టితో కూడిన నీటిని వాడటం వల్ల.. విద్యార్థుల చేతులు, మెడ, ఇతర భాగాల్లో తీవ్రమైన దురదలు, ఎలర్జీ, దద్దుర్లు వస్తున్నాయి. ఈ దారుణమైన పరిస్థితికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. కేవలం మూడు తరగతుల వారికి మాత్రమే భౌతిక తరగతులు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

“రక్షిత నీరు అడిగితే.. అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయం బయటకు చెబితే సస్పెండ్ చేస్తామని భయపెడుతున్నారు. సురక్షితమైన తాగునీరు అందించకపోగా, ఇలా బెదిరించడం అధికార దుర్వినియోగం కాదా?” అంటూ తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (TSAS) నాయకులు మండిపడుతున్నారు. సురక్షిత తాగునీరు అందించక‌పోవడం.. పైగా బెదిరించడం అధికార దుర్వినియోగమేనంటూ వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీలో ఈ అమానవీయ ఘటనలపై నిర్మల్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులను బెదిరిస్తున్న అధికారుల తీరుపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కనీస అవసరమైన రక్షిత నీరు అందించడంలో విఫలమైన యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి, ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి అధికారులు చర్యలు తీసుకుంటారా? లేదా విద్యార్థుల ప్రాణాలతో ఇంకెంత కాలం ఆటలాడుకుంటారు? అనేది వేచి చూడాలి.

You might also like