ఏసీబీకి చిక్కిన ఎస్ఐ శ్రీనివాస్
కీసర పోలీస్ స్టేషన్.. ఇప్పుడు ఈ పేరు చెబితేనే అవినీతి బాగోతాలు గుర్తొస్తున్నాయి. రక్షక భటులే భక్షకులుగా మారి కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అదే స్టేషన్కు చెందిన ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది. గతంలో స్టేషన్ బెయిల్ కోసం సీఐ, ఒక ఎస్ఐ లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఘటన మరువకముందే.. తాజాగా అదే స్టేషన్ కు చెందిన మరో ఎస్ఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చార్జిషీట్లో అనుకూలంగా వ్యవహరించేందుకు ఏకంగా రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడా ఆ అవినీతి ఎస్ఐ..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో మరో అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. కంచే చేను మేసిన చందంగా.. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. తాజాగా ఓ కేసులో చార్జిషీట్ త్వరగా, అనుకూలంగా దాఖలు చేసేందుకు ఎస్ఐ కొండారెడ్డి శ్రీనివాస్ ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నాడు.
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై చీటింగ్ తో పాటు, 498-A కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బెయిల్పై ఉన్న ఆ వ్యక్తి.. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కీసర పోలీస్స్టేషన్లో హాజరవుతున్నాడు. ఈ క్రమంలో చార్జిషీట్లో అతనికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు, త్వరగా ఫైల్ చేసేందుకు ఎస్ఐ శ్రీనివాస్ ఏకంగా రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు బతిమాలడంతో.. చివరకు రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అప్పటినుంచి ఆ డబ్బు ఇవ్వాలంటూ బాధితుడిపై ఎస్ఐ తరచూ ఫోన్లు చేస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేశాడు.
ఎస్ఐ వేధింపులు భరించలేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి వ్యూహం ప్రకారం.. బాధితుడు లంచం డబ్బును కవర్లో పెట్టుకుని నాగారం పరిధిలోని శిల్పానగర్ కాలనీకి వెళ్లాడు. అక్కడ బాధితుడి నుంచి ఎస్ఐ శ్రీనివాస్ రూ.2 లక్షలు తీసుకుంటుండగా.. ముందుగానే మాటు వేసిన ఏసీబీ బృందం దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఎస్ఐని అరెస్టు చేసి అవినీతి నిరోధక శాఖ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ వెల్లడించారు.
కీసర పోలీస్ స్టేషన్లో ఇలా ఖాకీలు ఏసీబీకి పట్టుబడటం ఇదే తొలిసారి కాదు. కేవలం రెండు నెలల క్రితమే ఇక్కడి సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఎస్ఐ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఒక కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేసి, ఇకపై వేధించకుండా ఉండేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసి, చివరకు 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గణేష్ నిమజ్జన డ్యూటీలో ఉన్న ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి.. సీఐ ఆదేశాలతో కీసర చెరువు సమీపంలో కారులో రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల తిరగకముందే అదే స్టేషన్లో మరో ఎస్ఐ పట్టుబడటం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.