అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు
అర్ధరాత్రి రైల్వేస్టేషన్‌లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పలు అంశాలపై ఆరా తీశారు. ఏకంగా పోలీస్‌కమిషనర్ రంగంలోకి దిగి ఈ తనిఖీలు చేపట్టడం గమనార్హం.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్‌తో కలిసి రైల్వే స్టేషన్ పరిసరాలను సందర్శించిన సీపీ, రైల్వే సిబ్బంది, దుకాణాల యజమానులు, ప్రయాణికులతో భద్రతా పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక పోలీసులు చేపడుతున్న రాత్రి పెట్రోలింగ్,నిఘా చర్యలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పర్యవేక్షణను పరిశీలించారు.
అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు,ఇతర వ్యాపార సంస్థలు నిర్ణీత సమయపాలన పాటిస్తున్నాయా లేదా అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రాత్రి వేళల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పోలీస్ నిఘా కొనసాగించాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు పాల్గొన్నారు.