నూతన అంబులెన్సుల ప్రారంభం
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు నూతన అంబులెన్సులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. డీఎంఎఫ్‌టీ ఫండ్ నుంచి రూ.20 లక్షలతో వీటిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, సత్వర వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అత్యవసర సమయాల్లో రోగులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించేందుకు ఈ అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
నియోజకవర్గంలో వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు. అత్యాధునిక వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచి, అత్యవసర చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాబోయే ఏడాదిలోగా సంపూర్ణ వైద్య సదుపాయాలు కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, నగర పాలక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్ తదితరులు పాల్గొన్నారు.