ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక
Priyanka Gandhi as PM:కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా..? ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని రాహుల్ ని పక్కన పెట్టాలని సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారా..? ప్రియాంక ప్రధాని అవుతుందని ఆమె భర్త రాబర్ట్ వాద్రా మాటల్లోని ఆంతర్యం ఏమిటి..? అది కేవలం ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలేనా..? లేక ఎవరైనా చెప్పించారా..? ఇలా ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అంశంగా కొనసాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగించాలని ఎన్నో రోజులుగా డిమాండ్ కొనసాగుతోంది. కొద్ది కాలంగా దేశంలో జరుగుతున్న ఏ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. రాహుల్ నాయకత్వంతో తాము ఏం సాధించలేకపోతున్నామని పార్టీ నేతలే భావిస్తున్నారు. దీంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ప్రియాంక భర్త.. రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ప్రియాంక చాలా కష్టపడుతుంది. రాజకీయాలు, జీవితం గురించి ఆమె తన నానమ్మ ఇందిర దగ్గర చాలా విషయాలు నేర్చుకుంది. ఆమె నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వారి సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుంది. రాజకీయాల్లో ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. దేశ ప్రజలు ప్రియాంకలో.. ఆమె నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరను చూస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రధానిగా ప్రియాంక ఉండాలని కోరుకుంటున్నారు.. అందుకు మద్దతిస్తున్నారు కూడా అంటూ వెల్లడించారు. అదే సందర్భంలో రాహుల్ గాంధీ కూడా ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారని తెలిపారు. ప్రియాంక, రాహుల్ గాంధీ రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయన్నారు. దేశం కోసం వారు.. వారికి ఎంతో ప్రియమైన వారిని సైతం కోల్పోయారు అని చెప్పుకొచ్చారు.
ఇలా ఆయన ప్రియాంక గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట అదే పార్టీకి చెందిన ఎంపీ సైతం ప్రియాంకకు పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకకి పార్టీ అప్పగించాలనే వాదన కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు.. పార్టీ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించాలని కోరుతూ.. నేరుగా సోనియా గాంధీకే లేఖ రాశారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. ప్రియాంకని ప్రధాన మంత్రిని చేస్తే.. తను పాకిస్థాన్ భరతం పడుతుందని.. ఆమె ఇందిరా గాంధీ మనవరాలంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి.