పాకిస్తాన్‌ను ఉతికి ఆరేశాడుగా..

Viraansh Bhanushali:అత‌ను రాజ‌కీయ నాయ‌కుడు కాదు… దౌత్య‌వేత్త అంత‌కంటే కాదు.. కేవ‌లం ఒక లా విద్యార్థి… ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన చ‌ర్చా వేదిక‌లో మ‌న ప్ర‌త్య‌ర్థి దేశం పాకిస్తాన్‌ను ఉతికి ఆరేశాడు. అత‌న్ని ఆపాల‌ని ఎంత ప్ర‌య‌త్నం చేసినా పాక్‌ను చీల్చి చెండాడాడు.

వీరాంశ్ భానుశాలి.. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో లా విద్యార్థి.. ఆ యూనివ‌ర్సిటీలో భారత్-పాక్ మధ్య జరిగిన వాదోపవాదాలలో పాకిస్థాన్ తీరును చీల్చి చెండాడారు. ముంబైకి చెందిన ఈ విద్యార్థి, పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో జ‌రుగుతున్న ఉగ్ర‌వాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంద‌ని భార‌త్‌లో ఎక్క‌డ ఏ ఉగ్ర‌దాడి జరిగినా దాని ఉగ్ర‌వాద మూలాలు పాక్‌లోనే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌తి ఒక్క ఉదంతాన్ని తీసుకుంటూ పూర్తి విశ్లేషిస్తూ ముందుకు సాగాడు.

2008లో ముంబై ఉగ్రదాడి జరిగినప్పుడు తన వయస్సు చాలా తక్కువని, తన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న సీఎస్‌ఎంటీ స్టేషన్‌లో జరిగిన మారణకాండను కళ్లారా చూశానని వీరాంశ్ భావోద్వేగంగా చెప్పారు. “సిగ్గు లేని దేశాన్ని మనం ఎప్పటికీ సిగ్గుపడేలా చేయలేము. భారత్ తన ఆత్మరక్షణ కోసం తీసుకునే చర్యలు ‘పాప్యులిజం’ (ప్రజాకర్షక రాజకీయాలు) కాదు.. అది బాధ్యత” అని స్పష్టం చేశారు. కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలోనే భార‌త‌దేశం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చేసిన వ్యాఖ్య‌లు సైతం చాలా స్ప‌ష్టం ఖండించాడు.

1993 పేలుళ్ల సమయంలో ఎన్నికలు లేవు, కానీ పాక్ ఐఎస్ఐ ముంబైని రక్తపాతం చేసింది. భారతదేశం నిజంగా ప్రజాకర్షక విధానాన్ని అనుసరించి ఉంటే, 26/11 తర్వాత యుద్ధం ప్రారంభించి ఉండేదన్నారు. కానీ భారతదేశం సంయమనంతో కూడిన దౌత్యం, అంతర్జాతీయ వేదికలపై సాక్ష్యాలను ప్రదర్శించే మార్గాన్ని ఎంచుకుందని తెలిపారు. అయినా 26/11 తర్వాత భారత్ ఎంతో ఓపిక పట్టిందని, కానీ ఆ శాంతి కాముకత మనకు పఠాన్‌కోట్, ఉరి, పుల్వామా దాడులను మిగిల్చిందని దుయ్యబట్టారు. ఆపరేషన్ సిందూర్‌ను ఎన్నికల స్టంట్ అని పిలవడం అశాస్త్రీయమని, ఎందుకంటే ఆ సమయానికి ఎన్నికలు ముగిసిపోయాయన్నారు.

ఇటీవల జరిగిన సైనిక చర్య ఎన్నికల కోసం కాదని, అమాయక పర్యాటకులను చంపిన ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికేనని వీరాంశ్‌ వివరించారు. పాకిస్థాన్ అంతర్గత పరిస్థితులపై వీరాంశ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “మీ దేశ ప్రజలకు రొట్టెలు (ఆహారం) ఇవ్వలేరు, అందుకే వారికి యుద్ధం అనే సర్కస్‌ను చూపిస్తున్నారు. పేదరికాన్ని అధికారంగా మార్చుకోవడానికి యుద్ధ భయాన్ని వాడుకుంటున్నారు” అని పాక్ ప్రతినిధి మూసా హర్రాజ్ ముందే ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. “మేము ఉల్లిపాయలు, విద్యుత్ వ్యాపారం చేసుకునే మంచి పొరుగువారిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మీరు ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా వాడుకున్నంత కాలం, మేము సిద్ధంగానే ఉంటాం” అని వీరాంశ్ తన ప్రసంగాన్ని ముగించారు.

ఒక పాక్ మంత్రి కుమారుడు చర్చను అడ్డుకోవాలని చూసినా ఎక్క‌డా ఆగ‌కుండా… త‌న ప్ర‌సంగాన్ని ఆప‌కుండా వీరాంశ్ ముందుకు సాగాడు. ఒక భారతీయ విద్యార్థి వాస్తవాలతో పాక్ అసలు రంగును ప్రపంచం ముందు బయటపెట్టారు. ముంబై దాడుల వార్షిక దినమైన నవంబర్ 26 మరుసటి రోజే ఈ చర్చ జరగడం విశేషం. నిజానికి ఈ చర్చా కార్యక్రమం చుట్టూ పెద్ద వివాదమే నడిచింది. ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ప్రెసిడెంట్ మూసా హర్రాజ్ (పాక్ రక్షణ శాఖ మంత్రి కుమారుడు), భారత ప్రతినిధులకు ఆహ్వానాలు అందకుండా చేసి, భారత్ తప్పుకుందని తప్పుడు ప్రచారం చేశారు. అయితే, విద్యార్థుల స్థాయిలో జరిగిన చర్చలో వీరాంశ్ భానుశాలి పాక్ బృందాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు..

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like