రైతుల ఉసురుపోసుకుంటున్నరు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఉసురుపోసుకుంటున్నాయని ఆదిలాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాప్రి వద్ద జాతీయ రహదారిపై మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ నాణ్యత లేదని సోయా పంట కొనుగోలు చేయడం లేదని ఇది ఎంత వరకు సమంజసమన్నారు. రంగు మారిన సోయా పంట కొనుగోలు చేయకుండా ఎమ్మెల్యే, కేంద్ర,రాష్ట్ర మంత్రులు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల ఉసురు తాకుతుందని శాపనార్థాలు పెట్టారు. రెండు ప్రభుత్వాలు దొందు దొందే అన్నారు. కొర్రీలు పెట్టకుండా సోయా పంట కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రేపు ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎంపీ ఇళ్లను ముట్టడిస్తామని స్పష్టం చేశారాయన.
రైతుల కోసం మా ప్రాణం అయినా ఇస్తామన్నారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జోగు రామన్న తెలిపారు. పెద్దఎత్తున ఆందోళన చేయడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో మార్క్ ఫెడ్ డీ ఎం, రెవెన్యూ అధికారులు ధర్నా వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్ మాట్లడుతూగ్రేడ్ ల ప్రకారం కొనుగోలు చేయడం కోసం ప్రపోజల్ పంపించామని, ఆదేశాలు రాగానే కొనుగోలు చేస్తామన్నారు.