అభివృద్ధికి సహకరించండి
బెల్లంపల్లి జీఎంను కలిసిన ప్రజాప్రతినిధులు
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సింగరేణి జీఎం ను కలిశారు. బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా జీఎంతో నూతన సర్పంచులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి సింగరేణి తరఫున సహకరించాలని విన్నవించారు. ప్రస్తుతం సర్పంచులుగా ఎన్నికైన తామంతా సింగరేణి ఏరియాలో పనిచేసి రిటైర్ అయిన కార్మికుల బిడ్డలమే అని తెలిపారు. మా గ్రామాల నుంచి వివిధ ఏరియాలకు పనిచేసే కార్మికులు చాలామంది ఉన్నారని, ఇక్కడ మాజీ కార్మికులు కూడా నివసిస్తున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా జీఎం నూతనంగా ఎన్నికైన సర్పంచులను, ఉప సర్పంచ్ లను అభినందించారు. సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడు తమ తోడ్పాటును అందించి అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి, ఐఎన్టి యుసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, సర్పంచులు కుశనపల్లి లక్ష్మణ్, పరపతిరావు, వెంకటేష్, ఉప సర్పంచలు సూరం దామోదర్ రెడ్డి, కాపర్తి సుభాష్, ప్రబాత్ రావు తదితరులు పాల్గొన్నారు.