క‌విత‌క్క కంట క‌న్నీరొలిక వేళ‌..

Kalvakuntla Kavitha:క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న రాజీనామా ఆమోదించాల‌ని కోరుతూ శాస‌న మండ‌లిలో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. కంట‌నీరు పెట్టుకున్నారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానని శపథం చేశారు. తన రాజీనామా ఆమోదించాలని మండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించాన‌ని అప్పటి నుంచి తనపై ఆంక్షలు మెుదల‌య్యాయ‌ని చెప్పారు. బీఆర్ఎస్‌లో తనకు ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేశాన‌ని స్ప‌ష్టం చేశారు.

పార్టీలో ప్రశ్నిస్తే.. తనపై కక్షగట్టారని క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే ఇక రాష్ట్రంలో ఎలా ఉంటుదని ప్రశ్నించారు. పార్టీలో తనకు ఘోరమైన అన్యాయం జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈడీ, సీబీఐలతో పోరాడే సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదన్నారు. కేసీఆర్‌ను కాపాడుకోలేని పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? హరీశ్ రావు అవినీతి పరుడు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం పెద్ద జోక్. పార్టీ నడిపే పద్ధతి ఇది కాదు. నైతికత లేని పార్టీ బీఆర్ఎస్. కనీసం సంజాయిషీ కూడా అడగకుండా నన్ను సస్పెండ్ చేశారు. నా ఇద్దరి కొడుకుల మీద ఒట్టు వేసి చెప్తున్న.. బీఆర్ఎస్‌తో నాది ఆస్తుల పంచాయితీ కాదు. ఆత్మగౌరవ పంచాయితీ అని కవిత వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌గా మార్చడాన్ని తాను వ్యతిరేకించానన్నారు కవిత. పార్టీలో తాను ఎప్పుడూ టికెట్ కోసం ప్రాధేయపడలేదని.. పార్టీనే తనకు పిలిచి టికెట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. రాజకీయ పదవుల కోసం తాను బతుకమ్మ ఆడలేదన్నారు. 69 నాటి ఉద్యమకారులను బీఆర్ఎస్ గుర్తించలేదన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ మొదలు సచివాలయం నిర్మాణం వరకు అన్నింటిలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి స్థూపం వరకు అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

బీఆర్ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తే ఎవరూ మాట్లాడటం లేదని.. హరీష్‌, కేటీఆర్‌ను ప్రశ్నిస్తే మాత్రం ఉద్యమాలు చేస్తున్నారన్నారు. తాను వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నానని.. కానీ శక్తిగా మళ్లీ చట్టసభల్లోకి అడుగుపెడతానని అన్నారు. ఈ సందర్భంగా మండలిలో ఓ కవితను కూడా చదవి వినిపించారు ఎమ్మెల్సీ కవిత. అయితే కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించలేదు. భావోద్వేగంలో కవిత రాజీనామా నిర్ణయం తీసుకుని భావిస్తున్నట్టు తెలిపిన మండలి చైర్మన్.. దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు. మండలి చైర్మన్ చేసిన ఈ సూచన కవిత తిరస్కరించారు. రాజీనామాపై పునరాలోచన లేదని స్పష్టం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like