ఫ్రీగా హలీమ్.. ఎగబడిన జనం..
ముస్లింలకు రంజాన్ ప్రారంభమైంది. దీంతో ఎక్కడ చూసినా ఇప్పుడు హలీమ్ బట్టీలు విరివిరిగా వెలుస్తున్నాయి… చాలా హోటళ్లలో వీటిని తయారు చేస్తున్నారు. గల్లీ నుంచి మెయిన్ సెంటర్ వరకు వేల సంఖ్యలో హలీమ్ విక్రయాలు కొనసాగుతున్నాయి. రంజాన్ మాసంలో దొరికే హలీమ్ కోసం హైదరాబాద్ నగరవాసులు ఎగబడుతున్నారు. అయితే కస్టమర్లను ఆకట్టుకునేందుకు హోటల్లు కూడా భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్.. రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ఉచితంగా హలీమ్ అందించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటనతో రచ్చ రంబోలా అయ్యింది.
హైదరాబాద్‌లోని వాహ్ మండి అనే రెస్టారెంట్ యాజమాన్యం.. రంజాన్ వేళ ఫ్రీ హలీమ్ ఆఫర్ పెట్టింది. పబ్లిసిటీ కోసం ఈ ప్రకటన కాస్తా తీవ్ర గందరగోళానికి దారితీసింది. మటన్ హలీమ్ ఫ్రీగా ఇస్తామన్న యాడ్‌తో వందల సంఖ్యలో నగరవాసులు ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాహ్ మండి ముందు వందల సంఖ్యలో నగరవాసులు బారులు తీరారు. ఓ వ్యక్తి ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫ్రీ హలీమ్ కోసం జనాలు ఒకరిని తోసుకుంటూ పరుగులు తీస్తుండటం ఆ వీడియోల్లో కనిపిస్తుంది. కొంతమంది చిన్న చిన్న పిల్లలను కూడా తమ వెంట పెట్టుకుని ఆ హోటల్‌కు రావడంతో అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది. తండోపతండాలుగా వచ్చిన జనాలను కంట్రోల్ చేయటం ఆ హోటల్ సిబ్బంది వల్ల కాలేదు. దీంతో అక్కడ ఒకానొకదశలో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది.
దీనివల్ల కొండాపూర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ఆఫర్లు ఆవసరమా..? అంటూ కొందరు నెటిజన్లు హోటల్ యాజమాన్యంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అదే సమయంలో జనాలు ఇంత ఖాళీగా ఉన్నారా..? అంటూ సైతం పోస్టులు పెడుతున్నారు.