మరో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన నేతగా రికార్డ్!
Modi:భారత ప్రధాని నరేంద్ర మోదీ (Indian Prime Minister Narendra Modi) మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో 100 మిలియన్ల (10 కోట్ల)కు పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఈ స్థాయిలో ఫాలోవర్స్ కలిగిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. ఆర్థిక సంస్కరణలు, బలమైన విదేశాంగ విధానం, నిర్ణయాత్మక పరిపాలనతో మోదీ, భారత్‌ను గ్లోబల్ స్టేజ్‌పై శక్తివంతమైన దేశంగా నిలబెట్టారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా నిలిచారు. మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే రెండు రెట్లు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం.
ప్రధాని మోదీ 2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. మోదీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆయన పర్యటనలకు, సమావేశాలకు, ప్రసంగాలకు సంబంధించి ముఖ్యమైన పోస్టులు కనిపిస్తుంటాయి. అయితే కొద్ది కాలంలో ఇన్‌స్టాగ్రామ్ డిజిటల్ ప్లేస్‌లో మోదీ అకౌంట్ పెద్ద ఎత్తున ఫాలోవర్స్‌ను ఆకర్షించింది. ఇది ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణను తెలియజేస్తుంది. తాజాగా మోదీ ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 100 మిలియన్స్ దాటింది. దీంతో ప్రపంచంలోని ప్రధాన నాయకులలో ప్రధాని మోదీ నేడు అత్యధిక సంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
ప్రపంచ నాయకుల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ విషయానికి వస్తే… 43.2 మిలియన్ల ఫాలోవర్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 15 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా 14.4 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగో స్థానంలో, టర్కిష్ అధ్యక్షుడు ఎర్డోగన్ 11.6 మిలియన్ల ఫాలోవర్లతో ఐదో స్థానంలో, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 6.4 మిలియన్ల ఫాలోవర్లతో ఆరో స్థానంలో ఉన్నారు. అయితే ఈ ఐదుగురు నాయకుల మొత్తం ఫాలోవర్స్ సంఖ్యను కలిపిన… ప్రధాని మోదీ వ్యక్తిగత ఫాలోవర్స్ సంఖ్య కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇది డిజిటల్ ప్రపంచంలో ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణను తెలియజేస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ విషయంలో ఇతర భారతీయ రాజకీయ నాయకుల కంటే ప్రధాని మోదీ పలు రేట్లు ముందు ఉన్నారు. భారత్‌లో ప్రధాని మోదీ తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 16.1 మిలియన్ల మంది ఫాలోవర్లతో రెండవ స్థానంలో ఉండగా, రాహుల్ గాంధీ 12.6 మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు.
.