అన్న‌గా… అండ‌గా…

భార‌త్‌కు ర‌ష్యా ముడిచ‌మురు

Russian crude oil for India:భార‌త్‌కు ఎలాంటి సంక్షోభం అయినా స‌రే… నేనున్నానంటూ ముందు నిల‌బ‌డుతుంది ర‌ష్యా… ఇప్పుడు కూడా పెద్ద‌న్న పాత్ర పోషించేందుకు ఆ దేశం ముందుకు వ‌చ్చింది. ఇరాన్‌… ఇజ్రాయిల్‌, అమెరికా యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ముడిచ‌మురు కొర‌త ఏర్ప‌డింది. దీంతో మీకు మేమున్నామ‌ని ముడి చ‌మురు పంపిస్తామ‌ని భార‌త్‌కు ర‌ష్యా బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రానున్న 10-15 రోజులు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత ప్రభుత్వం అన్వేషిస్తోంది. ప్రస్తుతం కేవలం 74 రోజులకు సరిపడ ముడి చమురు నిల్వలు ఉన్న‌ట్లు స‌మాచారం. అయినా, యుద్దం మ‌రింత ముందుకు వెళితే ముడి చ‌మురు ధ‌ర‌లు పెరిగి, అవి దేశంలో నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రా మీద ప్ర‌భావం చూపుతుంది. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో దాదాపు 40% హొర్ముజ్ జ‌ల‌సంధి ద్వారా జరుగుతోంది. అయితే, యుద్ధం ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌కు చమురు సరఫరాలను అడ్డుకుంది. దీని ఫలితంగా ముడి చమురు ధరలు పెరగవచ్చన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇది భారతదేశం – చైనా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. అమెరికా-ఇజ్రాయెల్‌ ఉమ్మడి దాడుల దరిమిలా ఇరాన్‌ ప్రతిదాడులకు పాల్పడడంతో హొర్ముజ్‌ జలసంధి సమీపంలో వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. అయితే, రష్యా ఎప్పటిలాగే, ఈ సంక్షోభ సమయంలో భారతదేశానికి మరోసారి మద్దతు ఇవ్వడానికి రక్షకుడిగా ముందుకు వచ్చింది. ఇంటర్‌ఫ్యాక్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ బుధవారం కీలక ప్రకటన చేశారు. చైనా, భారతదేశాలకు చమురు సరఫరాలను పెంచడానికి రష్యా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

భారతీయ సముద్ర జలాలకు సమీపంలోనే ఉన్న నౌకలలోని దాదాపు 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్‌ చేరుకోగలదని పరిశ్రమ వర్గాలు రాయిటర్స్‌ వార్తాసంస్థకు తెలిపాయి. రష్యన్‌ చమురు నౌకల అసలు గమ్యస్థానం వివరాలను వెల్లడించడానికి ఆ వర్గాలు నిరాకరించాయి. రిఫైనరీ సంస్థలకు ఊరట కలిగిస్తూ కొన్ని వారాల్లోనే ఈ చమురు నౌకలు భారత్‌ చేరుకుంటాయని మాత్రం వారు తెలిపారు.

 

 

You might also like