రెండు కీల‌క అస్త్రాల‌ను ప్ర‌యోగించిన కేంద్రం

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒకేసారి రెండు కీలక అస్త్రాలను ప్రయోగించింది. ఒకవైపు ‘అత్యవసర వస్తువుల చట్టం’ (ECA) ద్వారా వంటగ్యాస్ (LPG) ఉత్పత్తిని పెంచాలని ఆదేశించగా, మరోవైపు పెట్రోల్, డీజిల్ రవాణాలో అంతరాయాలు కలగకుండా ‘ఎస్మా’ (ESMA) చట్టాన్ని అమలు చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశంలో ఎల్పీజీ కొరత రాకుండా ఉండేందుకు కేంద్రం ‘అత్యవసర వస్తువుల చట్టాన్ని’ అమల్లోకి తెచ్చింది.

యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భార‌త్‌లో సైతం తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. దేశంలో ఎల్పీజీ కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ESMA) అధికారాలను వినియోగిస్తూ దేశంలోని ఆయిల్ రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పత్తి వెంటనే పెంచాలని ఆదేశించింది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించింది. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసింది.

ఇకపోతే ఇటీవల కొన్ని నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటల్ పరిశ్రమ తీవ్ర ప్రభావం ఎదుర్కొంటోంది. సరఫరా అంతరాయం వల్ల అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కేంద్రం ఉత్పత్తి పెంపుతో పాటు సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వినియోగదారులు, వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు త్వరలోనే తగ్గుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

అయితే ఈ పరిస్థితుల ప్రభావం దేశంలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే కనిపిస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయాలు వస్తున్నాయని హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని వారు అంటున్నారు. ఇటీవల చెన్నై హోటళ్ల అసోసియేషన్ ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఎల్పీజీ కొరత కారణంగా రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమలకు సరఫరా అయ్యే కమర్షియల్ గ్యాస్ తగ్గిందని పేర్కొన్నారు. ఈ సమస్యపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like