ప్ర‌తి నెలా మెడిక‌ల్ బోర్డు నిర్వ‌హించాలి

-తీవ్రంగా న‌ష్ట‌పోతున్న కార్మికులు
-శారీర‌క వైక‌ల్యం ఉన్నా ఫిట్ ఇస్తున్నారు
-ఎన్నిమార్లు చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేదు
-సీఎండీకి విన‌తిప‌త్రం ఇచ్చిన టీబీజీకేఎస్ నేత‌లు

TBGKS:సింగ‌రేణిలో ప్ర‌తి నెలా మెడిక‌ల్ బోర్డు నిర్వ‌హించాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లు డిమాండ్ చేశారు. వారు మంగ‌ళ‌వారం సింగ‌రేణి సీఎండీని క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ సింగ‌రేణిలో నిర్వ‌హించే మెడిక‌ల్ బోర్డు నిర్వ‌హించ‌క‌పోవ‌డంతో కార్మికులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మెడికల్ బోర్డ్ (CMB) సమావేశాలు మార్చి 2025 వరకు క్రమం తప్పకుండా జరిగాయని…. ఆ తర్వాత, గత బోర్డుల ద్వారా హయ్యర్ సెంటర్లకు రిఫర్ చేసిన ఉద్యోగుల కోసం మాత్రమే జూలై 2025లో ఒక ప్రత్యేక బోర్డు నిర్వహించిన‌ట్లు వెల్ల‌డించారు.

ఆ త‌ర్వాత‌, సిక్ రోల్స్‌లో (Sick Rolls) ఉన్న ఉద్యోగుల కోసం నవంబర్ 2025లో మరొక మెడికల్ బోర్డును నిర్వహించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి మెడికల్ బోర్డు నిర్వహించలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కార్మికుల కోసం మెడిక‌ల్ బోర్డు ప్ర‌తి నెలా నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీబీజీకేఎస్ నేత‌లు సీఎండీ దృష్టికి తీసుకువెళ్లారు. తీవ్రమైన గుండె జబ్బులు, నరాల వ్యాధులు, కిడ్నీ సమస్యలు, శారీరక వైకల్యంతో బాధపడుతున్న ఉద్యోగులను కూడా పలు సందర్భాల్లో విధులకు అర్హులుగా (Fit) గుర్తిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇటువంటి ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవడం వారి భద్రతకే కాకుండా ఇతరుల భద్రతకు కూడా ముప్పు వ‌స్తుంద‌న్నారు. జూలై నుంచి నవంబర్ 2025 బోర్డులలో ‘ఫిట్’ అని ప్రకటించిన వారికి తిరిగి వైద్య పరీక్షలు (Re-medical examination) నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని గతంలో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. మరణించిన లేదా వైద్యపరంగా అనర్హత పొందిన (Medically Invalidated) ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల ప్రక్రియ అక్టోబర్ 2025 నుండి నిలిచిపోయిందని…. కంపెనీ నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను తక్షణమే పునఃప్రారంభించాల‌ని డిమాండ్ చేశారు.

సీఎండీని క‌లిసిన వారిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, అధ్య‌క్షుడు మిరియాల రాజిరెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేతిరెడ్డి సురేంద‌ర్‌రెడ్డి, చీఫ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కాపు కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like