“మీరు ఐఏఎస్, ఐపీఎస్ లా..? విశాఖ ఇండస్ట్రీ ఉద్యోగులా?”

-కలెక్టర్, డీసీపీలపై బాల్క సుమన్ ఫైర్
-క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యం ఖూనీ
-సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డులో అన్యాయం
-ఇళ్ల పట్టాల పంపిణీ చేయ‌క‌పోతే ఆందోళ‌న‌
-మంత్రి వివేక్ ప‌చ్చి అబద్దాలు చెబుతున్నారు
-బీఆర్ఎస్ స‌ర్పంచ్‌ల‌కు ఈజీఎస్ ప‌నులు పెట్ట‌డం లేదు
-మంత్రి పీఏ ర‌మ‌ణారావు అధికారుల‌పై ఒత్తిడి తెస్తున్నారు
-పోలీసులు సైతం మా నేత‌ల‌ను కాంగ్రెస్‌లోకి వెళ్ల‌మంటున్నారు

Balka Suman:క్యాతన్‌ పల్లి చైర్మన్ ,వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకున్నా గెలిచేందుకు దొడ్డిదారిలో ప్ర‌య‌త్నాలు చేశారని బీఆర్ ఎస్ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీస్ స్టేషన్ లో సంతకం కోసం వచ్చిన సుమన్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఎన్నిక సంద‌ర్భంగా మా మీదనే రాళ్ల‌తో దాడి చేశారని.. పోలీసులు మా పైనే లాఠీచార్జీ చేసి.. మా మీదనే కేసు నమోదు చేసి జైల్లో పెట్టారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడు వారాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆర్డ‌ర్‌ను మ‌న్నించి వీలైనంత త్వరగా ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. 13న కౌన్సిల‌ర్లు గెలిపొందితే ఇప్ప‌టి వ‌ర‌కు కూడా క్యాత‌న్ ప‌ల్లిలో వారు లేకుండా చేశార‌ని.. నెల రోజులకుగా పైగా కుటుంబ సభ్యులకు దూరంగా కౌన్సిలర్లు ఉండే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మంత్రి వివేక్ ప‌చ్చి అబ‌ద్దాలు..
మంత్రి వివేక్ ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడుతున్నార‌ని బాల్క సుమ‌న్‌ మండిప‌డ్డారు. రామకృష్ణాపూర్ లో కొత్త గ‌ని తీసుకువ‌స్తున్నామ‌ని చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇక్క‌డ వ‌స్తున్న గ‌ని కాద‌ని అది ఓపెన్‌కాస్టు అని అది కూడా ఉన్న ఓపెన్‌కాస్టు విస్త‌ర‌ణ అని సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో తాము అధికారంలో ఉన్న‌ప్పుడే ఫైల్ పంపించామ‌ని అప్పుడు దానికి అట‌వీశాఖ అనుమ‌తులు రాలేద‌ని, ఇప్పుడు వ‌స్తోంద‌న్నారు. దానితో ఈ ప్రాంతానికి వేలాదిగా ఉద్యోగాలు వచ్చేదేం లేద‌న్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు కాసిపేట 2 గ‌ని తీసుకువ‌చ్చామ‌న్నారు. దాంతో వెయ్యి మందికి ఉద్యోగాలు వ‌చ్చేలా చేశామ‌న్నారు. మంత్రికి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌పై ప్రేమ ఉంటే భూగ‌ర్భ గ‌ని తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టాలు ఎందుకు ఇవ్వ‌లేదు..?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు సింగరేణి ప్రాంతాల్లో నివసిస్తున్న 3,300 మంది కుటుంబాలకు ఇండ్ల పట్టాలిచ్చామ‌న్నారు. మరో 2817 మంది డీడీలు కట్టి ఉన్నారు.. వారికి పట్టాలివ్వాలని మంత్రి వివేక్‌కు బాల్క సుమ‌న్ సూచించారు. ఒక‌వేళ ప‌ట్టాలు ఇవ్వ‌క‌పోతే ల‌బ్ధిదారులు అంద‌రితో కలిసి ధర్నా చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సింగ‌రేణిలో మెడికల్ బోర్డు పెట్టడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒకవేళ పెట్టినా 97 శాతం మందిని ఫిట్ చేసి పంపిస్తున్నారని అన్నారు. మేం అధికారంలో ఉన్న‌ప్పుడు మెడిక‌ల్ అన్‌ఫిట్ ద్వారా 16,500 మందికి, పెండింగ్ డిపెండెంట్ ద్వారా దాదాపు మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామ‌న్నారు.

క‌లెక్ట‌ర్ గారూ ఆలోచించండి…
మంత్రి వివేక్ పీఏ రమణారావ్ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్ సర్పంచ్ లున్న చోట ఎన్ఆర్ ఈజీఎస్ పనులు చేయనీయడం లేదన్నారు. ఇదేం ప‌ద్ద‌తి…? ఇదేం సంస్కృతి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉపాధి హామీ ప‌థ‌కం నిధులు కేంద్రానివి అని… జిల్లా కలెక్టర్ విశాఖ ఇండస్ట్రీ ఉద్యోగి కాకపోతే ఈజీఎస్ పనులు చేయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ స‌ర్పంచ్ లు ఉన్న చోట కూడా ఎన్ఆర్ఈజీఎస్ ప‌నులు పెట్టాల‌న్నారు. లేదంటే కోర్టుకు వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. పోలీసులు సైతం మా సర్పంచ్ లకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ల‌మంటున్నారని అన్నారు. ఆ అధికారి ఆడియో సైతం ఉందని… అవసరం వచ్చినప్పుడు బయటపెడతామ‌ని సుమ‌న్ స్ప‌ష్టం చేశారు.

ఈ వ్య‌వ‌హారంలో కూడా డీసీపీ విశాఖ ఇండస్ట్రీ ఉద్యోగి కాకపోతే వివేక్‌కు ఊడిగం చేసే పోలీసు అధికారుల‌కు చెప్పాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌లెక్ట‌ర్‌, డీసీపీ ఇప్ప‌టికైనా త‌మ ప‌ద్ద‌తి మార్చుకోవాలని హిత‌వు ప‌లికారు. బాల్క సుమ‌న్ వెంట మాజీ జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ మూల రాజిరెడ్డి, తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత మేడిప‌ల్లి సంప‌త్‌, చేకూరి అనిల్‌, ల‌క్ష్మీకాంత్ త‌దిత‌రులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like