ఇక భార‌త్ సొంత గ్యాస్‌… సామాన్యుడికి పండ‌గే..

Alternative Fuel For LPG: ప‌శ్చిమాసియాలో యుద్ధం నేప‌థ్యంలో సామాన్యుడిపై భారం ప‌డుతోంది. ఎల్‌పీజీ ర‌వాణాలో ఎదుర‌వుతున్న ఇబ్బందులతో వంట గ్యాస్ (LPG) ధరల భారంతో కుదేల‌వుతున్నారు. భ‌విష్య‌త్‌లో దీని కొర‌త ఏంట‌నేది ఇప్పుడు చాలా మంది మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌. ఈ ఇంధ‌న సంక్షోభం నుంచి గ‌ట్టెక్కెందుకు భార‌త్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దానిలో భాగంగా ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ‘డై మిథైల్ ఈథర్’ (DME) అనే కొత్త ఇంధనాన్ని వాడేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో అటు విదేశీ దిగుమతుల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గించ‌డ‌మే కాకుండా, సామాన్యుడికి ఊర‌ట క‌ల‌గ‌నుంది. అదే స‌మ‌యంలో ప‌ర్యావ‌ర‌ణానికి కూడా మేలు జ‌రగ‌నుంది.

‘డై మిథైల్ ఈథర్’అంటే..?
‘డై మిథైల్ ఈథర్’ (DME) అనేది మిథ‌నాల్ ఉప‌యోగించి త‌యారు చేసే వాయువు. దీనిని గాలిలోని కార్బ‌న్ డై ఆక్సైడ్‌, త‌క్కువ నాణ్య‌త ఉన్న బొగ్గుతో దీనిని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎల్పీజీ తరహాలోనే సులభంగా ద్రవ రూపంలోకి మారుతుంది.. నిల్వ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఇంధనం వల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఎల్పీజీతో పోలిస్తే డై మిథైల్ ఈథర్ మండినప్పుడు తక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. దీని వల్ల వంట గదిలో పొగ, కాలుష్యం తగ్గుతాయి. మనం వాడుతున్న పాత గ్యాస్ స్టవ్‌లలో ఎటువంటి మార్పులు చేయకుండానే, ఎల్పీజీలో కొంత శాతం డీఎంఈ కలిపిన మిశ్రమాన్ని నేరుగా వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా..
భారత ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా ఇంధన దిగుమతులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ఇంధనం ప్రభుత్వ లక్ష్యానికి ఎంతో ఊతమిస్తుంది. కేవలం వంట గ్యాస్ కోసమే కాకుండా, భవిష్యత్తులో వాహనాలలో కూడా ఈ ఇంధనాన్ని వాడే అవకాశం ఉంది. దీని తయారీ యూనిట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్ని ఇస్తుంది. గ్యాస్ కంపెనీలు ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటే త్వరలోనే ప్రతి ఇంట్లో తక్కువ ధరకే గ్యాస్ సరఫరా అయ్యే రోజులు వస్తాయి. విదేశీ ఇంధనాలపై ఆధారపడకుండా మన సొంత వనరులతోనే వంట గ్యాస్ తయారు చేసుకోవడం ఒక గొప్ప విజయమని చెప్పవచ్చు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like