తెలంగాణ బడ్జెట్ లో కొత్త పథకాలు..

Telangana Budget:తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త పథకాలను ప్రకటించింది. దాదాపు ఐదు కొత్త‌ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మే కాకుండా, వాటి అమలుపై సైతం స్ప‌ష్ట‌త ఇచ్చారు. కొత్తగా ప్రతీ కుటుంబానికి రూ 5 లక్షల భీమా సదుపాయం, రానున్న ఆర్దిక సంవత్సరంలో రెండు లక్షల మేర కొత్త పెన్షన్ల మంజూరు… విద్యార్ధుల కోసం బడ్జెట్ లో రెండు పథకాలను భట్టి ప్రకటించారు.

తెలంగాణ బడ్జెట్ 2026-27లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్త పథకాలను ప్రకటించారు. రాష్ట్రంలో అందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయ‌నున్నారు. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబంపడే మానసిక వేదన ఒకటైతే, వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయింపులు చేసినట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. 2026 జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా అల్పాహార‌ పథకాన్ని అందించనున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్ర‌తి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావతో అల్పాహారం అందిస్తారు. ఇక, అడ్వాన్స్​డ్​ ట్రైనింగ్ సెంటర్​లలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల రూ. 2 వేల స్కాలర్​షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ‌లో కొత్త‌గా ఇంట‌ర్మీడియెట్ విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం సైతం అందించ‌నున్నారు.

తెలంగాణ‌లో సీఎం ఓవ‌ర్సీర్ ఎంప్లాయిమెంట్ కింద రాష్ట్ర యువ‌త‌కు విదేశాల్లో సుర‌క్షిత‌మైన ఉపాధి, భాషా నైపుణ్యాలు, వీసా మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందించ‌డానికి ఈ కార్య‌క్ర‌మం చేప‌ట‌నున్నారు. అదే విధంగా, ఇంట‌ర్మీడియెట్ చ‌దువుతున్న దివ్యాంగ విద్యార్థుల‌కు రెట్రో ఫిట్టెడ్ మోట‌రైజ్డ్ వాహ‌నాల‌ను అందించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని అందించనున్నారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు భట్టి తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 1.20 కోట్ల ప్రమాద బీమా వర్తించనుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like