బొగ్గు గనిలో కొత్త పోరు..
Singareni:సింగరేణిలో మరో యూనియన్ పురుడు పోసుకోనుంది… కార్మిక హక్కుల సాధనే లక్ష్యంగా కొత్త యూనియన్ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. యూనియన్ విధివిధానాలు, నాయకుల చర్చలు జోరుగా సాగుతున్నాయి… యూనియన్ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని భావించిన నేతలు ఆ వైపుగా పావులు కదుపుతున్నారు.. అస్తిత్వ పోరాటంలో ఉన్న కార్మికులు ఈ కొత్త సంఘాన్ని ఆదరిస్తారా? ప్రస్తుత సంఘాల మౌనం కొత్త దారికి పునాది వేస్తుందా? సింగరేణిలో నూతన పరిణామాలపై ‘నాంది న్యూస్’.. ప్రత్యేక కథనం…
సింగరేణిలో కొత్త కార్మిక సంఘం పురుడుపోసుకోనుంది. సింగరేణిలో ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో కొత్త కార్మిక సంఘం ఏర్పాటుకు ఇదే సరైన సమయని భావిస్తున్న కొందరు నేతలు ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం (TBGKS) ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కెంగర్ల మల్లయ్య కొత్త కార్మిక సంఘం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగా ఆయన ఇప్పటికే పలువురు నేతలతో మాటామంతీ నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాల్లో తనకు అనుకూలంగా వారితో చర్చలు జరుపుతున్నారు. కార్మిక సంఘం విధివిధానాలు, ప్రణాళికలు, కార్మిక సంఘం పేరు, జెండా ఇలా అన్ని రకాలుగా చర్చలు సాగిస్తున్నారు. అయితే, ఆ కార్మిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు..? అనే దానిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది..
ఇదే సరైన సమయని భావిస్తున్న కెంగర్ల…
ప్రస్తుతం సింగరేణి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా కార్మికుల హక్కులు హరించుకుపోతున్నా, చివరకు మెడికల్ బోర్డు విషయంలో ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోకున్నా కార్మిక సంఘాలు మౌనం వహిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు మెడికల్ బోర్డు నిర్వహించకున్నా ఏ ఒక్క కార్మిక సంఘం పట్టించుకోలేదు. తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం, యాజమాన్యంపై ఒత్తిడి తేవడంలో ఆ సంఘాలు విఫలమయ్యాయి. మారుపేర్ల సమస్య, కొత్త గనుల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే సింగరేణిలో ఎప్పుడూ లేని విధంగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కార్మిక సంఘం ఏర్పాటైతే కార్మికులు ఆదరిస్తారని కెంగర్ల మల్లయ్య భావిస్తున్నారు.
సమయం కోసం ఎదురుచూసి..
ప్రస్తుతం కెంగర్ల మల్లయ్య బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. మొదట టీబీజీకేఎస్‌లో కీలకపాత్ర పోషించిన ఆయన టీబీజీకేఎస్‌లో అంతర్గత కలహాల నేపథ్యంలో బయటకు వెళ్లారు. బీఎంఎస్ చేరి… మళ్లీ తిరిగి అధిష్టానం హామీ మేరకు తిరిగి బీఆర్ఎస్‌లోకి వచ్చారు. అయినా, ఆయనకు టీబీజీకేఎస్‌లో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలోనే సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయన కొత్త కార్మిక సంఘం ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొత్త కార్మిక సంఘానికి ఆదరణ లభిస్తుందా..? కార్మికులు ఏ మేరకు కార్మిక సంఘం వైపు మొగ్గు చూపుతారు..? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.