దాడులు… అరెస్టులు… గెలిచేదెవ్వరు..?
Kyathannapalli Municipality Election:ఆందోళనలు… దాడులు… అరెస్టులు… జైళ్లు…. ఒక ఎన్నిక కోసం జరుగుతున్న పోరు… అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది… అయితే, ఈ ఎన్నిక ఎవరికి లాభం చేకూర్చనుంది…? ఎవరికి నష్టం మిగిల్చింది…? అధికార పార్టీ వైఖరి ఏంటి…? ప్రతిపక్షాల వ్యూహమేంటి..? మార్చి 4న ఏం జరగబోతోంది..? నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సీటు కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, సీపీఐ కూటమి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు టికెట్ల పంపకాల దగ్గర నుంచే ఇక్కడ లొల్లి షురూ అయ్యింది… రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. తమను కించపరిచేలా మాట్లాడారని అలిగిన కామ్రేడ్లు బీఆర్ఎస్‌తో చేతులు కలిపి పోటీ చేయడంతో ఫలితాలు తారుమారు అయ్యాయి. అప్పటి నుంచి ఎన్నికలు ముగిసినా మున్సిపాలిటీ పీఠం కైవసం విషయంలో రెండు పార్టీల మధ్య పోరు తారస్థాయికి చేరింది. దీంతో ఇప్పటి వరకు పీఠముడి అలాగే కొనసాగుతోంది.
అధికార పార్టీ తప్పుల మీద తప్పులు…
ఈ ఎన్నిక విషయంలో అధికార పార్టీ కాంగ్రెస్ తప్పుల మీద తప్పులు చేస్తూ పోతోంది. ఇక్కడ సీపీఐకి మంచి పట్టుంది. ఆ విషయాన్ని మరిచిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని తక్కువ చేశారు. నేతలను డీసీసీ అధ్యక్షుడు చులకన మాట్లాడటంతో అది తట్టుకోలేని కామ్రేడ్లు కారు పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయి. పొత్తులో భాగంగా 22 సీట్లున్న క్యాతన్‌పల్లిలో సీపిఐతో కలిసి బీఆర్ఎస్ 14 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం కేవలం 7 సీట్లకే పరిమితం అయింది. కారు మ్యాజిక్ ఫిగర్ దూసుకుపోయింది. తమ ఓటమి హుందాగా ఒప్పుకుని ఆ సీటు వదిలేయాల్సిన అధికార పార్టీ మరింతగా ముందుకు పోవడంతో రచ్చ,రచ్చగా మారింది.
మంత్రి వివేక్‌కు డ్యామేజీ…
వాస్తవానికి ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకంటే కూడా మంత్రి వివేక్(Minister Vivek)కు డ్యామేజీని మిగిల్చింది. అసలు సీపీఐతో పొత్తు సందర్భంగా ఆయన కలుగచేసుకుని రాజీ చేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. అది ఆయన మొదటి ఫెయిల్యూర్. ఇక, ఎన్నికలు అయిన తర్వాత ప్రతిపక్షానికి పూర్తి మెజారిటీ వచ్చినా సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అది కూడా ఆయనకు కలిసి రాలేదు. ఇదంతా ఒకెత్తు కాగా, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కోసం వెళ్తున్న బీఆర్ఎస్, సీపీఐ నేతలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం… రాళ్ల దాడి, పోలీసుల లాఠీచార్జీ ఇదంతా మంత్రికి తలనొప్పి వ్యవహారంగా మారింది. చిలికిచిలికి గాలివానలా మారి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను జైలుకు తరలించే వరకు వెళ్లింది. మరో వైపు తమ వైపు వచ్చే వారికి మంత్రి భారీ ఆఫర్లు ఇచ్చారని దానిని వారు తిరస్కరించారనే వార్తలు మంత్రి వివేక్ కు మరింత నష్టాన్ని మూటగట్టాయి.
బీఆర్ఎస్‌కు మరింత ఊపు తెచ్చిన ఎన్నిక..
ఇక సహజంగానే ఈ ఎన్నిక బీఆర్ఎస్‌కు ఎన్నో రకాలుగా మేలు చేసింది. కారు పార్టీ గెలిచినా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులపై కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్‌కు సానుకూలంగా మారేలా చేసింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Former MLA Balka Suman) అటు అధికార కాంగ్రెస్‌పై, మంత్రి వివేక్‌పై దుమ్మెత్తిపోశారు. తప్పులు వాళ్లు చేసి తమను జైలు పాలు చేశారని, ప్రజాస్వామ్యం అపహస్యం చేశారంటూ దుయ్యబట్టారు. మంత్రి వివేక్ ఆయన తండ్రి వెంకటస్వామి పరువు తీస్తున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆయనను జైలుకు పంపిన క్యాతన్‌పల్లి ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నిక తర్వాతి పరిణామాలతో బీఆర్ఎస్ క్యాడర్‌ను ఒక్కసారిగా తట్టిలేపినట్లయ్యింది. ఈ ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో తాము విజయం సాధిస్తామని ఆ పార్టీ ఉత్సాహంతో ఉంది.
చివరకు విజయం ఎవరిది..?
అయితే, ఎన్నికల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. అసలే అధికార పార్టీ, మంత్రి అంగబలం అర్థబలం తట్టుకుని బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా..? లేక ఎవరినైనా తమ వైపునకు తిప్పుకుని కాంగ్రెస్ పార్టీ క్యాతన్‌పల్లి పీఠాన్ని కైవసం చేసుకుంటుందా..? అనేది శనివారం రోజు తేలనుంది. ఏదిఏమైనా ఇప్పటి వరకు మాత్రం కాంగ్రెస్ సెల్ప్‌గోల్ చేసుకుని ఇబ్బందులు పడుతుండగా, బీఆర్ఎస్ విజయం సాధిస్తామనే పక్కా ధీమాగా ముందుకు సాగుతోంది.. అయితే, ఇప్పటికే ఈ ఎన్నిక విషయంలో అధికారులు, పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నిక జరగకుండా అధికారులు, పోలీసులు ఓ ప్రణాళిక ప్రకారం పనిచేశారని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇప్పటికైనా ఎన్నిక విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.