గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి
రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద
గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని మంత్రి వివేక్ అన్నారు. శనివారం చెన్నూర్ గోదావరి నది తీరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఇతర అధికారులతో పుష్కర ఘాట్ ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు దక్షిణాది కుంభమేళా తరహాలో ఉంటాయన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రజా రవాణా వ్యవస్థ, పుష్కర ఘాట్ ప్రాంతాలలో లైటింగ్, తాగునీటి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. చెన్నూర్ పట్టణంలోని మహంకాళి వాడ నుంచి పుష్కర ఘాట్ వరకు నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.
పుష్కరాలలో భక్తుల సంఖ్య అంచనా ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వెలుతురు, పారిశుద్ధ్యం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి తీర ప్రాంతాలలో పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు చెప్పారు. చెన్నూర్ పట్టణంలో స్మశాన వాటిక కోసం 1 కోటి రూపాయలు కేటాయించనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూర్ గోదావరి తీరంలో పుష్కర స్నానాలకు రోజుకు 2 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. పార్కింగ్, వాహనాల నియంత్రణకు అంతర్గత రహదారుల విస్తరణ, రహదారుల విస్తరణ, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదుల ఏర్పాటు శాశ్వత ప్రాతిపదికన చేసే విధంగా కార్యచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, జైపూర్ ఎ.సి.పి. వెంకటేశ్వర్లు, చెన్నూర్ తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, దేవాదాయ, విద్యుత్, రహదారులు భవనాల శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.