కేజీ టు పీజీ ఫ్రీ… 4 లక్షల ఉద్యోగాలు…
కవితక్క కొత్త పార్టీ కీలక హామీలు ఇవే...
Kalvakuntla Kavitha New Party Manifesto: తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కవిత.. ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు. తన లక్ష్యాలను స్పష్టంగా ప్రజలకు వివరించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఐదు కీలక హామీలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో అందరికీ ఉచిత విద్యను అందిస్తామని చెప్పిన కవిత… రాష్ట్రంలో ఏ రోగానికైనా ఏ ఆసుపత్రి అయినా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. రైతే రాజు అన్న నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఏ ఆఫీస్కు వెళ్లినా రైతు అని చెబితే ప్రత్యేక మర్యాదలు ఉంటాయని పేర్కొన్నారు. వారికి ప్రత్యేకంగా చూసి వారి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని చట్టం తీసుకొస్తామన్నారు.
కల్వకుంట్ల కవిత గారు ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” (TRS) నూతన పార్టీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు… ప్రజలకు ఇచ్చిన ఐదు కీలక హామీలు ఇవే:
1. విద్య, వైద్యం
ఉచిత విద్య: ప్రైవేటు పాఠశాలల్లో సైతం అందరికీ ఉచిత విద్యను అందించడమే లక్ష్యం.
ఉచిత వైద్యం: రాష్ట్రంలో ఏ రోగానికైనా, ఏ ఆసుపత్రిలోనైనా (ప్రభుత్వ లేదా ప్రైవేట్) ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
2. రైతు సంక్షేమం (రైతే రాజు)
రైతులకు ప్రాధాన్యత: ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ‘రైతు’ అని చెబితే వారికి ప్రత్యేక గౌరవం, మర్యాద దక్కేలా చూస్తారు.
చట్టపరమైన రక్షణ: రైతుల పనులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించారు.
3. నిరుద్యోగిత, ఉపాధి
బంపర్ నోటిఫికేషన్: అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
యూత్ ఛాయిస్: యువత కేవలం ఉద్యోగాలు చేయడం మాత్రమే కాకుండా, వ్యాపార రంగంలో స్థిరపడాలనుకునే వారికి కూడా ప్రభుత్వం పూర్తి చేయూతనిస్తుంది.
ఉద్యమకారులకు గౌరవం: తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా ఉద్యోగ కోటాను కేటాయిస్తారు.
4. సామాజిక న్యాయం
అన్ని వర్గాలకు అండ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లకు సమాన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మౌలిక వసతులు: అర్హులైన పేదలందరికీ విద్య, వైద్యంతో పాటు సొంత ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు.
5. అభివృద్ధి పథం
బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు ఆర్థికంగా ఎదిగేందుకు కావాల్సిన అన్ని వసతులను, రాయితీలను ప్రభుత్వం తరఫున కల్పిస్తామని స్పష్టం చేశారు.
ప్రతి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు….? కానీ, అసలు మీ ఆలోచన ఏంటని ఎవరైనా అడిగారా..? అంటూ కవిత యువతను ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో మాత్రం ఉద్యోగం చేయాలో, వ్యాపారం చేయాలో ఆ దిశగానే వారికి చేయూత అందిస్తామని వెల్లడించారు. వచ్చిన మొదటి ఏడాది నాలుగు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కేటాయిస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్రవర్ణపేదలకు, ముస్లీంలు, క్రిస్టియన్లకు న్యాయంచేసేలా వారికి విద్య, వైద్యం, ఇల్లు ఇవ్వడంతోపాటు వారు అభివృద్ధి చెందేందుకు కావాల్సిన అన్ని వెసులుబాటులను ప్రభుత్వం తరఫున అందిస్తామని కవిత స్పష్టం చేశారు.