పార్టీ మారాలి మళ్ళీ.. మళ్ళీ..
-రికార్డుస్థాయిలో పార్టీలు మారిన నేతగా గుర్తింపు
-ఈసారి కవిత పార్టీలోకి జంప్
చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ… ఇది ఒక సినిమా లో డైలాగ్… దీన్ని కొంచం మార్చుకుని ఓ నాయకుడు పార్టీ మారాలి మళ్ళీ మళ్ళీ అని రాసుకున్నాడు.. అలాగే చేస్తున్నాడు కూడా… ఇంతకి ఎవరా నేత…? ఏంటా కథ…?
పార్టీ లు మారడంలో రికార్డు సృష్టించిన మాజీ మంత్రి బోడ జనార్దన్ మళ్ళీ పార్టీ మారెందుఁకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్నా మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్న అయన మళ్లీ పార్టీ మారెందుకు కీలక భేటీ నిర్వహించారు. తరచూ పార్టీలు మారే నేతగా గుర్తింపు పొందిన ఆయన తాజాగా కవితతో మంతనాలు జరిపారు. కవితతో భేటీ అనంతరం బోడ జనార్దన్ మాట్లాడుతూ, త్వరలోనే తన అనుచరవర్గంతో కలిసి అధికారికంగా పార్టీలో చేరతానని వెల్లడించారు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్‌ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి, పార్టీ విస్తరణకు తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పార్టీలు మార్చడంలో ఒక రకంగా రికార్డు సాధించారు కూడా.. చెన్నూర్ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు శాసన సభ్యుడిగా, చంద్రబాబు హయంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన జనార్ధన్ తూర్పు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. ఆయన 1985లో టిడిపి శాసన సభ్యుడిగా మొదటి సారి గెలుపొందారు. 1988లో ఆర్టీసి కార్పోరేషన్ చైర్మన్‌గా, 1989, 1994లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కార్మిక మంత్రిత్వశాఖను నిర్వర్తించారు. 2003లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేసిన బోడ జనార్ధన్ తిరిగి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగానే వ్యవహరించి రాష్ట్ర నేతగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత రాజకీయాల్లో నెలకొన్న మార్పుల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంతరం బీజేపీలో పనిచేసి తర్వాత తిరిగి సొంతగూటికి చేరుకొని టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇవ్వకపోవడంతో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (సీపీఎం కూటమి) నుంచి పోటీ చేశారు. తిరిగి బీజేపీలో చేరారు. బీజేపీలో ఆయనకు తగిన ప్రాధాన్యత దొరకలేదు. దీంతో అయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ గూటి నుంచి కవిత సమక్షంలో TRS తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు.
ఎన్నో పార్టీలు తిరిగి గడ్డం వివేక్ మంత్రి పదవి సంపాదించారని.. తాను కూడా పార్టీలు మారి తిరిగి మంత్రి అవుతానని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన అనుచరులు అంతా TRS లో ఉంటారా..? మళ్లీ ఏడాది రెండేళ్లలో పార్టీ మారుతారా..? అనే విషయంలో చర్చించుకుంటున్నారు.