రెండేళ్లయినా అందని బకాయిలు..

కలెక్టరేట్‌లో ఫొటోగ్రాఫర్ల ఆందోళన

పార్లమెంట్ ఎన్నికల విధుల్లో రాత్రింబవళ్లు శ్రమించి పనిచేసిన ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని, రెండేళ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బకాయిలను చెల్లించకపోవడం అన్యాయమని మంచిర్యాల నియోజకవర్గ ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములును అసోసియేషన్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తాము ఎన్నికల విధులను నిర్వహించామని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి రెండు సంవత్సరాలు దాటిపోతున్నా, తాము చేసిన పనికి సంబంధించిన పూర్తి పారితోషికాన్ని అధికారులు ఇప్పటివరకు విడుదల చేయలేదని మండిపడ్డారు.

మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన పలువురు వీడియో, ఫొటోగ్రాఫర్లకు కలిపి ఇంకా రూ. 4 లక్షల రూపాయల బకాయిలు రావాల్సి ఉందన్నారు. నమ్ముకున్న వృత్తిని పక్కనబెట్టి ప్రభుత్వ ఎన్నికల విధుల్లో పాల్గొంటే, ఇంతకాలం బిల్లులు ఆపడం వల్ల తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ​చిన్నపాటి వృత్తిదారులమైన తమపై ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అడిషనల్ కలెక్టర్ వి. రాములు సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యను పరిశీలించి త్వరలోనే బకాయిలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధులు జక్కుల రాజు, కుమారస్వామి, పరమేష్, మల్లేష్, శ్రీనివాస్,పలువురు ఫొటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like