రక్తదానంతో ఎంతో మందికి ప్రాణదానం
-టీజీఎఫ్ డీసీ డివిజనల్ మేనేజర్ గణేష్
-టీజీఎఫ్ డీసీ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం
-జీవన్ ధార రక్తనిధి కేంద్రానికి 17 యూనిట్ల రక్త సేకరణ
రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఎంతో లబ్ధి చేకూరుతుందని, ఇది ప్రాణదానంతో సమానమని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ జి.గణేష్ అన్నారు. జూన్ 1 నుండి 12 వరకు నిర్వహిస్తున్న ‘పర్యావరణ ఉత్సవాల’ను పురస్కరించుకొని, టీజీఎఫ్డీసీ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ గణేష్ మాట్లాడుతూ.. నిత్యం అడవి సంరక్షణలో బిజీగా ఉండే అటవీ సిబ్బంది, సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కాగజ్నగర్ పట్టణానికి చెందిన జీవన్ ధార స్వచ్ఛంద రక్తనిధి కేంద్రం సహకారంతో చేపట్టిన ఈ శిబిరంలో అటవీ అభివృద్ధి సంస్థ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ గణేష్తో పాటు ప్లాంటేషన్ మేనేజర్లు గోగు సురేష్ కుమార్ (మంచిర్యాల రేంజ్), లక్ష్మణ్ (కాగజ్ నగర్ రేంజ్), జలపతి (బెల్లంపల్లి రేంజ్) రక్తదానం చేసి తోటి సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. డివిజన్ కార్యాలయం ఉద్యోగులు, ఫీల్డ్ సూపర్వైజర్లు, ప్లాంటేషన్ వాచర్లు ,సిబ్బంది కలిసి మొత్తం 17 యూనిట్ల రక్త దానం చేశారు. రక్తదానం పట్ల సిబ్బందిలో చైతన్యం తీసుకువచ్చిన టీజీఎఫ్డీసీ అధికారులను, రక్త నిధి కేంద్రం నిర్వాహకులు జీవన్ ధార స్వచ్ఛంద రక్తనిధి కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ రఘు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రక్త దానం చేసిన వారికి నిర్వాహకులు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.