అటవీ వీరులకు వన సంరక్ష పురస్కారాలు
Forest Department:అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ భూముల రక్షణలో విశిష్ట సేవలు అందిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ స్టేట్ వన సంరక్ష మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ రూల్స్–2026″ను అమల్లోకి తీసుకొచ్చింది. వన మహోత్సవం-2026 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వన సంరక్ష పతకం (రజత పతకం), తెలంగాణ ఉత్తమ వన సంరక్ష పతకం (వెండి పతకం), తెలంగాణ విశిష్ట వన సంరక్ష పతకం (బంగారు పతకం) తెలంగాణ ముఖ్యమంత్రి వన శౌర్య పతకం (ప్రత్యేక బంగారు పతకం) పేర్లతో నాలుగు పురస్కారాలను ప్రవేశపెట్టింది.
ఈ పురస్కారాల కింద పతకంతో పాటు నగదు బహుమతి, నెలవారీ ప్రోత్సాహక నగదు కూడా అందజేయనున్నారు. తెలంగాణ వన సంరక్ష పథకానికి రూ.10,000, ఉత్తమ వన సంరక్ష పథకానికి రూ.15,000, విశిష్ట వన సంరక్ష పథకానికి రూ.20,000, ముఖ్యమంత్రి వన శౌర్య పథకానికి రూ.25,000 నగదు బహుమతిని అవార్డు గ్రహీతలకు అందజేయనున్నారు. అదనంగా నెలవారీ నగదు ప్రోత్సాహకం కూడా ఇస్తారు. అటవీ భూములను ఆక్రమణల నుంచి కాపాడడం, అటవీ నేరాల నియంత్రణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాల అమలు, నర్సరీల నిర్వహణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(GIS), మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS), పరిశోధన తదితర రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఈ అవార్డులకు ఎంపిక చేయనున్నారు.
అటవీ శాఖలో సేవాస్ఫూర్తి, అంకితభావం, విధి నిర్వహణలో నిబద్ధతను పెంపొందించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Forest Minister Konda Surekha) తెలిపారు. అటవీ సిబ్బందికి పురస్కారాలు ప్రకటించాలన్న తన విజ్ఞప్తికి స్పందించి అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి మంత్రి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లేదా ప్రభుత్వం నిర్ణయించే ప్రత్యేక రోజున ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.