ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు వరుస భూకంపాలు..

A series of earthquakes across the world:ప్రపంచ వ్యాప్తంగా ఒకేరోజు సంభవించిన భూకంపాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వెనెజువెలాలో అత్యంత శక్తివంతమైన రెండు భూకంపాలు నమోదు కాగా, అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా, జపాన్‌తో పాటు మ‌న దేశంలోని జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో కూడా భూమి కంపించింది. వెనెజువెలా శతాబ్దకాలంలోనే అరుదుగా ఎదురైన ప్రకృతి విప‌త్తు చవిచూసింది. అక్కడ తొలుత రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, కొద్ది సేపటికే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం వచ్చింది. ఇదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో 5.6 తీవ్రతతో, జపాన్‌లో 7.2, జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో కూడా 3.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.

భూకంపాల మధ్య సంబంధం లేదు..
ఈ భూకంపాల మ‌ధ్య‌ ఒకదానితో మరొకటి సంబంధం లేద‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన భూకంప శాస్త్రవేత్త డాక్టర్ లూసీ జోన్స్ ప్రకారం, ఈ భూకంపాలన్నీ వేర్వేరు ఫాల్ట్ సిస్టమ్‌లు, టెక్టానిక్ ప్లేట్ సరిహద్దుల్లో సంభవించాయి. అందువల్ల ఒక ప్రాంతంలో సంభవించిన భూకంపం మరో ప్రాంతంలో భూకంపాన్ని ప్రేరేపించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. భారీ భూకంపం ఒకటి వేల కిలోమీటర్ల దూరంలో మరో భూకంపానికి కారణమవడం అత్యంత అరుదైన విషయమని ఆమె తెలిపారు.

వెనెజువెలాలో ‘ఎర్త్‌క్వేక్ డబ్లెట్’ పరిస్థితి
ఒకే ప్రాంతంలో కొన్ని సెకన్లు లేదా నిమిషాల వ్యవధిలో దాదాపు సమాన తీవ్రతతో రెండు భారీ భూకంపాలు సంభవిస్తే దానిని శాస్త్రవేత్తలు ‘ఎర్త్‌క్వేక్ డబ్లెట్’గా పిలుస్తారు. సాధారణంగా ఒక పెద్ద భూకంపం తర్వాత తక్కువ తీవ్రతతో ఆఫ్టర్‌షాక్‌లు రావడం సహజం. అయితే ఎర్త్‌క్వేక్ డబ్లెట్‌లో మాత్రం రెండోసారి వచ్చే భూకంపం కూడా మొదటిదానికి దాదాపు సమాన తీవ్రతతో ఉంటుంది. వెనెజువెలాలో కేవలం 39 సెకన్ల వ్యవధిలో 7.1, 7.5 తీవ్రతలతో వరుసగా రెండు భారీ భూకంపాలు నమోదవడంతో, ప్రస్తుతం అక్కడి పరిస్థితిని శాస్త్రవేత్తలు ‘ఎర్త్‌క్వేక్ డబ్లెట్’గా అభివర్ణిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like