అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బీజేపీనా?
మంత్రి జూపల్లి ఎదుట నిర్మల్ కాంగ్రెస్ నేతల తీవ్ర అసహనం!
“రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందా.. లేక బీజేపీ అధికారంలో ఉందా?” అంటూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అసలు ఎవరి ప్రభుత్వం నడుస్తోందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఇక్కడి కాంగ్రెస్ కేడర్ ఉందని ఆవేదన చెందారు. జిల్లాలో అభివృద్ధి పనులపై అధికార పార్టీ నాయకులకు కనీస సమాచారం కూడా అందడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఒక అధికారిని బదిలీ చేయించలేని, జరిగిన బదిలీ నిలిపివేయలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.
అలాగే, అధికార పార్టీ నాయకులు కోరుకున్నా శంకుస్థాపన జరిగిన ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణాన్ని కూడా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని వాపోయారు. నాయకులుగా ఇలాంటి అవమానాలను భరించడం కష్టంగా మారిందని, ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ పదవులకు రాజీనామా చేసి సాధారణ కార్యకర్తలుగా కొనసాగుతామని నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతైనా సేవ చేస్తామని, అయితే ఇలాంటి పరిస్థితుల్లో పదవుల్లో కొనసాగడం కష్టమని పేర్కొంటూ, “మీకే దండం పెడతాం… మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలి” అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావును నాయకులు వేడుకున్నారు.
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక కాంగ్రెస్ నాయకులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగిన ఓ సమావేశంలో సైతం కాంగ్రెస్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యత లభిస్తోందని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అసహనం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్, నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే (మహేశ్వర్ రెడ్డి)లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనివల్ల క్షేత్రస్థాయిలో కష్టపడిన కాంగ్రెస్ నేతలు దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అటు ఆదిలాబాద్ జిల్లా, ఇటు నిర్మల్ జిల్లాలో సైతం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వారి అసమ్మతి చల్లార్చేందుకు ఇన్‌చార్జీ మంత్రి ఏం చేస్తారో వేచి చూడాలి మరి..