రాజకీయ కక్షతో కుల బహిష్కరణ..

రాజకీయ విభేదాల నేపథ్యంలో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణకు గురిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను పోలీసుల‌ను ఆశ్ర‌యించినా న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని బాధితులు వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం భీంపూర్ గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి… ఆ గ్రామానికి చెందిన గుర్ల తాన‌క్క కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు సభ్యురాలిగా గెలుపొందారు. అయితే, త‌మ‌ను బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలని గ్రామంలోని కొందరు పెద్దలు, కుల పెద్దలు ఒత్తిడి చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

తాము క‌ప్పుకోమ‌ని చెప్ప‌డం, అభిప్రాయాన్ని మార్చుకోకపోవడంతో తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని, కుల కార్యక్రమాలకు పిలవడం మానేశారని, గ్రామంలో ఉపాధి పనులకు కూడా ఎవరూ పిలవకుండా సామాజికంగా వెలివేశారని వార్డు స‌భ్యురాలి భ‌ర్త బాధితుడు చంద్రశేఖర్ వాపోయారు. ఈ ఘటనపై కన్నెపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని, సంబంధిత అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది.

You might also like