సోయ…. విత్త‌న మాయ‌..

మొలకెత్తని సోయా విత్తనాల సమస్య రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది.ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు ‘తేజస్వి’ రకం సోయా విత్తనాల 405 బ్యాగులను కొనుగోలు చేసి విత్తుకున్నారు. దాదాపు ప‌దిహేను రోజులు అవుతున్నా మొల‌క‌లు రాలేదు. దీంతో తాము మోస‌పోయామ‌ని గ్ర‌హించిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డారు. ఒక్క బ్యాగ్‌లోని విత్తనాలు కూడా మొలకెత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసినా పంట ప్రారంభ దశలోనే దెబ్బతినడంతో తీవ్ర నష్టాన్ని చవిచూశామని వాపోయారు. సంబంధిత విత్తనాల కంపెనీ ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

ఈ అంశంపై మంగళవారం కలెక్టరేట్‌కు చేరుకుని తమ గోడును జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంట‌నే దీనిపై కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. మొలకెత్తని సోయా విత్తనాల ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు. విచారణలో నకిలీ లేదా నాసిరకం విత్తనాల సరఫరా జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

 

You might also like