భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Petrol Price Cut : సాధారణ ప్రజలకు, ముఖ్యంగా ప్రతిరోజూ వాహనాలను వినియోగించే వారికి ఊరట కలిగించే వార్త వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ ఇంధన మార్కెట్లో కీలక చలనం వచ్చింది. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన ‘నయారా ఎనర్జీ’ దేశవ్యాప్తంగా తన బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో ఇంధన ధరలను తగ్గించిన మొదటి సంస్థగా నయారా ఎనర్జీ నిలిచింది. గతంలో అమెరికా-ఇరాన్ యుద్ధం తీవ్రస్థాయికి చేరి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకినప్పుడు.. దేశంలో అందరికంటే ముందుగా ఇంధన ధరలను పెంచిన రికార్డు కూడా నయారా ఎనర్జీ పేరిటే ఉంది. లీటరు పెట్రోల్‌పై రూ. 5.30, లీటరు డీజిల్‌పై రూ. 3 ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు ధరల తగ్గుదల ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలోనూ ఈ సంస్థే ముందడుగు వేసింది.
ఈ నిర్ణయంతో ప్రైవేట్ బంకులను ఆశ్రయించే వాహనదారులకు, ముఖ్యంగా రవాణా రంగానికి పెద్ద ఊరట లభించనుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు ధరల తగ్గింపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ప్రైవేట్ రంగంలో వచ్చిన ఈ మార్పుతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇంధన ధరలను తగ్గించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ వాద్నగర్లో నయారా ఎనర్జీ ప్రతియేటా 20 మిలియన్ టన్నుల రిఫైనరీని నడుపుతోంది.