ఆధారాలు చూపిస్తా… అబద్ధమైతే రాజీనామా చేస్తా..
-సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు
-కాంగ్రెస్ పాలనలో ₹4,300 కోట్ల అప్పుల్లోకి సింగరేణి
-సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట సీఎం బామ్మర్దికి ఓబీ టెండర్లు
-ఇక్కడి అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరుల గని సింగరేణి(Singareni)ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కుంభకోణాల ఖనిగా మార్చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు(Thanneeru Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో సింగరేణి కార్మికుల సమ్మేళనంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా ఎండగట్టారు. హరీష్ రావు మాట్లాడుతూ, తాను మాట్లాడే ప్రతి మాట ఆరు నెలలుగా ఆర్‌టీఐ (RTI) ద్వారా సేకరించిన పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నానని, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని నిరూపిస్తానని సవాల్ విసిరారు. ఇవి అబద్ధమని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని, లేదంటే రేవంత్ రెడ్డి తన బామ్మర్ది టెండర్లను రద్దు చేస్తారా? అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
బామ్మర్ది కోసం రూల్స్ మార్చారు
బీఆర్ఎస్ హయాంలో లేని ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే కొత్త నిబంధనను తెచ్చి, గతంలో మైనస్ 20 శాతానికి పోయిన ఓబీ (OB) టెండర్లను, ప్లస్ 15 శాతానికి పెంచి సింగరేణి సొమ్మును దోచిపెట్టారని హరీష్ రావు ఆరోపించారు. ఈ నిబంధన ద్వారా లబ్ధి పొందిన మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి (షోద కన్స్ట్రక్షన్స్) అని, ఆయనకు వెంకటేష్ ఖని ఓబీ టెండర్ కట్టబెట్టడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇదే నిబంధనతో నైనీ బ్లాక్ టెండర్లను రద్దు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సీఎం బామ్మర్దికి చెందిన 9 టెండర్లను రద్దు చేసే ధైర్యం ఎందుకు చేయలేదని నిలదీశారు. శ్రీరాంపూర్ ఓసి-2 లో కూడా కమీషన్ల కోసం 7 సార్లు టెండర్లు ఆపారని, బీఆర్ఎస్ నిలదీశాకే ఓపెన్ చేస్తే సంస్థకు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు.
లాభాల సంస్థను అప్పుల కుప్పగా మార్చారు
కేసీఆర్ పాలనలో వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లతో, లాభాలతో కళకళలాడిన సింగరేణిని నేడు ₹4,300 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ (OD) అప్పుల్లోకి నెట్టారని మండిపడ్డారు. గతంలో జెన్కో బకాయిలు ₹7,000 కోట్లు ఉంటే, ఈ రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ₹12,377 కోట్లకు పెంచి, కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చిందన్నారు. అవసరం లేకపోయినా కమీషన్ల కోసం సోలార్ ప్లాంట్లు పెట్టి ₹1,000 కోట్ల సింగరేణి ధనాన్ని వృథా చేశారని, జైపూర్ పవర్ ప్లాంట్ పీపీఏ (PPA) లేక ఆలస్యం కావడం వల్ల రోజుకు ₹2.5 కోట్ల నష్టం వస్తోందని లెక్కలతో వివరించారు. కాంగ్రెస్ చేతకానితనం వల్లే దేశంలో 5వ ర్యాంకులో ఉన్న ఎస్టీపీపీ (STPP) నేడు 65వ ర్యాంకుకు పడిపోయిందన్నారు.
40 లక్షల టన్నుల బొగ్గు మాయం
సింగరేణిలో ₹1,600 కోట్ల విలువైన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని, రికార్డుల్లో గొప్పల కోసం లేని బొగ్గును చూపించి తవ్వని బొగ్గుకు ఇన్‌కమ్ టాక్స్ కట్టారని హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. దీనిపై తాము కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తే.. ఆయన సీఎం రేవంత్ రెడ్డికే తిప్పి రాస్తూ “మీ మీద మీరే విచారణ చేసుకోండి” అనడం వెనుక ‘బడే భాయ్ – చోటే భాయ్’ బంధం దాగి ఉందని ఎద్దేవా చేశారు. సింగరేణిని కాపాడుకోవడానికి కేంద్ర విజిలెన్స్ లేదా సీబీఐ (CBI) విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
డిపెండెంట్ ఉద్యోగాలపై కక్ష
కేసీఆర్ మానవత్వంతో 16,000 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తే, రేవంత్ రెడ్డి వాటిని ఊడగొట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాగా గోల్డెన్ షేక్‌హ్యాండ్ ఇచ్చి కార్మికులను ఇంటికి పంపే కుట్ర జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ నిలదీస్తే నలుగురు మంత్రులు వచ్చి కేవలం 300 మందికి ఉద్యోగ పత్రాలిచ్చి పెద్ద పెద్ద స్పీచ్‌లు దంచారని విమర్శించారు. “కాంగ్రెస్ హటావో – సింగరేణి కో బచావో” నినాదంతో రాజకీయాలకతీతంగా కార్మికులంతా కలిసి పోరాడాలని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అవినీతి సొమ్మంతా రికవరీ చేసి సింగరేణిని కాపాడుకుంటామని హరీష్ రావు పిలుపునిచ్చారు.