ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
మూలమలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కెరమెరి నుంచి చింతలమానేపల్లి మండలం కర్జెల్లి రేంజ్ పరిధిలో కంచె ఏర్పాటు చేసేందుకు ట్రాక్టర్లో సిమెంట్ స్తంభాలు తీసుకువెళ్తున్నారు.
మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో కెరమెరికి చెందిన చల్లా అశోక్, పండిత్ రావు తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మరణించారు. ఇదే ప్రమాదంలో భీమ్ రావు, రాము అనే వ్యక్తులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ కమలాకర్ జేసీబీ సాయంతో స్తంభాలను తొలగించి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం సిర్పూర్ (టి) పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.