కాళేశ్వరం బాధ్యతలు కేసీఆర్ కే అప్పగిస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు రావాలని, ఒకవేళ కేసీఆర్ వాదనలో బలముందని నిరూపిస్తే రాబోయే మూడేళ్ల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను ఆయనకే అప్పగిస్తామని సవాల్ చేశారు.

బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, వాళ్లంతా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగించారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల ఆస్తులను ఎలా సంపాదించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ది పయనీర్ ప్రకారం.. కేసీఆర్ కుటుంబంపై, అవినీతి ఆరోపణలపై తీవ్ర విమర్శలు చేశారు. నిపుణుల సూచనల మేరకే ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రజల డబ్బును వృథా కాకుండా కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.

కేసీఆర్ నిర్మించిన ఇతర ప్రాజెక్టులు, ప్రజాభవన్, సచివాలయాన్ని ప్రస్తుతం తమ ప్రభుత్వం వినియోగిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే అది నిరుపయోగంగా మారిందని మండిపడ్డారు. ప్రస్తుతం బ్యారేజీల్లో నీటిని నింపి ఎత్తిపోతల చేపట్టాలని ఏ నిపుణుల కమిటీ కూడా సూచించలేదని సీఎం గుర్తుచేశారు. ఒకవేళ బలవంతంగా నీటిని నింపితే బ్యారేజీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదంతో పాటు భద్రాచలం నగరం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు కూడా వినియోగించుకోకుండానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల అప్పులు చెల్లించాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.నిపుణుల కంటే మెరుగైన సూచనలు ఎవరైనా ఇస్తే వాటిని కూడా పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించకూడదని, ప్రజా ధనం గోదావరి పాలుకాకుండా కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like