నాణ్యతే లక్ష్యం.. సింగరేణిలో ప్రత్యేక అధికారుల నియామకం

Singareni:రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న వేళ సింగరేణి సంస్థ బొగ్గు నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి నుంచి వినియోగదారులకు డిస్పాచ్ వరకు ప్రతి దశ నిశితంగా పర్యవేక్షించేందుకు ఏరియాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది. సింగరేణి బొగ్గు నాణ్యతే సంస్థకు గుర్తింపు అని స్పష్టం చేసిన సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి, ప్రకటించిన గ్రేడ్‌కు అనుగుణంగానే బొగ్గు సరఫరా జరిగేలా అన్ని ఏరియాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు, నాణ్యమైన బొగ్గును నిరంతరాయంగా సరఫరా చేయడానికి సింగరేణి సంస్థ ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు ఏరియాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ సింగరేణి సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాలు జారీ చేశారు.

రానున్న మూడు నెలల పాటు ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, గ్రేడ్ పరిరక్షణ, డిస్పాచ్, ఉత్పాదకత, పనితీరు మెరుగుదలతో పాటు కార్పొరేట్ విభాగాలు–ఏరియాల మధ్య సమన్వయం, సీఎస్‌ఆర్ కార్యక్రమాల అమలును కూడా పర్యవేక్షించనున్నారు.

డైరెక్టర్ (ఆపరేషన్స్)కు సత్తుపల్లి, ఇల్లందు ఏరియాలు, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్)కు మణుగూరు, భూపాలపల్లి, డైరెక్టర్ (ఫైనాన్స్)కు బెల్లంపల్లి, మందమర్రి, డైరెక్టర్ (ఈ అండ్ ఎం)కు ఆర్జీ-1, ఆర్జీ-3, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్)కు ఆర్జీ-2, నైనీ, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)కు శ్రీరాంపూర్, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలను ప్రత్యేక అధికారులుగా కేటాయించారు.

శనివారం సాయంత్రం సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “సింగరేణి బొగ్గు నాణ్యతే సంస్థకు గుర్తింపు. దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండద”ని స్పష్టం చేశారు.

కొన్ని ఏరియాల్లో అన్‌గ్రేడెడ్ బొగ్గు, షేల్ కలవడం వల్ల నాణ్యత దెబ్బతింటోందని అధికారులు వెల్లడించగా, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎండీ ఆదేశించారు. వార్షిక కోల్ గ్రేడేషన్ ప్రణాళిక ప్రకారం సీమ్‌ల వారీగా తవ్వకాలు చేపట్టి, ప్రకటించిన గ్రేడ్‌కు అనుగుణంగానే ఉత్పత్తి జరగాలని సూచించారు.

ఆఫ్‌లోడింగ్ ప్రాంతాల్లో బ్లాస్టింగ్‌కు ముందు బొగ్గు బెంచీలను పూర్తిగా శుభ్రం చేయాలని, రాయి, షేల్ పొరలను బొగ్గుతో కలపకుండా ప్రత్యేకంగా తవ్వి ఓవర్‌బర్డెన్‌లోనే డంప్ చేయాలని ఆదేశించారు. అలాగే ఫైరీ కోల్ నిర్వహణకు రూపొందించిన ఎస్‌ఓపీలను అన్ని ఏరియాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.

అన్ని ఓపెన్‌కాస్ట్ గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో తగిన సంఖ్యలో క్రషర్లు ఏర్పాటు చేసి, అవి ఎప్పటికప్పుడు సక్రమంగా పనిచేసేలా చూడాలని, ప్రతి ప్లాంట్‌లో రోజువారీ గ్రేడ్‌వారీ డిస్పాచ్ ప్రణాళికను రూపొందించి కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఉత్పత్తి నుంచి డిస్పాచ్ వరకు ప్రతి దశలో నాణ్యత నియంత్రణకు అధికారులు వ్యక్తిగత బాధ్యతతో వ్యవహరించాలని, సింగరేణి బొగ్గుపై వినియోగదారుల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి అధికారి బాధ్యత అని సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like