ఓపెన్ కాస్ట్ లో నిలిచిన ఉత్పత్తి

మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సింగరేణి బెల్లంపల్లి రీజియన్ ఓపెన్‌కాస్ట్ గనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీగా వర్షపు నీరు చేరడంతో గనుల్లో పనులు నిలిచిపోయాయి. బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, రవాణా కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి డివిజన్లలో వర్షపు నీరు భారీగా చేరడంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బొగ్గు ఉత్పత్తితో పాటు ఓవర్‌బర్డెన్ (ఓబీ) వెలికితీత పూర్తిగా నిలిచిపోయింది.

ఒక్కరోజులో 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 1 లక్షా 80 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీతకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

గనుల్లో నీరు నిల్వ ఉండటంతో డంపర్లు, ఎక్స్కవేటర్లు వంటి భారీ యంత్రాల నిర్వహణ కష్టంగా మారింది. ఫలితంగా బొగ్గు రవాణా కూడా తీవ్రంగా దెబ్బతింది. వర్షాలు తగ్గిన తర్వాత గనుల్లో నిల్వ నీటిని తొలగించి, పరిస్థితిని సమీక్షించిన అనంతరం మాత్రమే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని సింగరేణి అధికారులు తెలిపారు.

భారీ వర్షాలతో సింగరేణి బెల్లంపల్లి రీజియన్‌లో బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, రవాణా కార్యకలాపాలు నిలిచిపోవడం సంస్థ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like