డీజీపీ కార్యాల‌యంలో కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య

రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్ ప్రస్తుతం దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తున్నారు.

హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈ ఉదయం తీవ్ర విషాదం నెలకొంది. గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ స్వామి తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో కార్యాలయ వాష్‌రూమ్‌లో తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఘటనాస్థలంలో స్వామి రాసినట్లు భావిస్తున్న ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో “నా భార్య పిల్లలను ఏమీ అనొద్దు.. వాళ్లు మంచివాళ్లు.. వారిని వేధిస్తే చనిపోయి దయ్యమైనా కూడా వదిలిపెట్టను” అని రాసి ఉండటం గమనార్హం. అయితే ఈ నోట్‌లోని విషయాలను అధికారులు దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.

క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్వామి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, వ్యక్తిగత లేదా ఉద్యోగ సంబంధిత కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like