నగల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేసే దిశగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా నగల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, సీసీ కెమెరాల ఏర్పాటుపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. నేరాల నివారణతో పాటు ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డీసీపీ భాస్కర్ నేతృత్వంలో ఏసీపీ ప్రకాష్, ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు, ఎస్‌ఐలు నగరంలోని నగల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని వ్యాపారులకు సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డీసీపీ ఏ. భాస్కర్… మంచిర్యాల పారిశ్రామిక, వ్యాపార పరంగా తెలంగాణలో కీలక నగరమని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉండటంతో పాటు ప్రతిరోజూ వేలాది మంది రైల్వే మార్గంలో రాకపోకలు సాగిస్తున్నందున భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ చట్టం ప్రకారం ప్రతి వ్యాపార సంస్థ, బ్యాంకు, హోటల్, లాడ్జి, రెసిడెన్సీతో పాటు ప్రజలకు సేవలందించే అన్ని సంస్థలు తప్పనిసరిగా నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ సూచించారు. భవనం ముందు, వెనుక, లోపల మాత్రమే కాకుండా రహదారులపై జరిగే కదలికలు కూడా స్పష్టంగా రికార్డు అయ్యేలా కెమెరాలు ఉండాలని తెలిపారు.
నేరస్థులు ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఆర్మ్డ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని డీసీపీ వెల్లడించారు. మంచిర్యాలతో పాటు నస్పూర్, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో 24 గంటల పాటు పగలు, రాత్రి నిరంతర ఆర్మ్డ్ పెట్రోలింగ్ కొనసాగుతోందని తెలిపారు. జాతీయ రహదారులపైనా పెట్రోలింగ్ మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని డీసీపీ ఏ. భాస్కర్ పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు, నివాసాలు, వాణిజ్య సముదాయాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.