శివ్వారంలో గోదావరి పైపులైన్ ఎవరూ వినియోగించవ‌ద్దు

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

జిల్లాలోని జైపూర్ మండలం శివ్వారం గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి సరఫరా కోసం గోదావరి నది నుండి ఏర్పాటు చేసిన పైపులైన్‌ను ఎవరు వినియోగించవ‌ద్దని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. పైప్ లైన్ గ్రామ సర్పంచ్ అక్రమంగా వేలం వేశారనే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో శనివారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, గ్రామీణ నీటి సరఫరా శాఖ (మిషన్ భగీరథ) ఈ.ఈ. వెంకటేశ్వర్, డిప్యూటీ ఈఈ కిరణ్ లతో కలిసి గ్రామపంచాయతీని సందర్శించి గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన పైపులైన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సమక్షంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అనధికారికంగా వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ పైపులైన్‌ను వినియోగించినట్లయితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. ఈ పైప్ లైన్ ఎవరూ వినియోగించవ‌ద్ద‌ని గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా స్పందిస్తూ ఇకపై ఎవరూ ఈ పైపులైన్‌ను ఉపయోగించరాదని తీర్మానం చేశారు.

కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎ.ఈ. ఎన్. రాజమల్లయ్య, శివ్వారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సృజన, సర్పంచ్ అంజన్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్ద చల్లా విశ్వంబర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like