11.56 లక్షల ఇండ్లు ఇవ్వండి
-ఉపాధి హామీ కింద కొత్త పనులకు అనుమతి ఇవ్వాలి
-కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు
-ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
-కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కీలక భేటీ
CM Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ నిధుల సాధనే లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Union Minister for Rural Development and Agriculture Shivraj Singh Chouhan)తో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G)’ కింద సుమారు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. ఉపాధి హామీ చట్టంలో కొత్త పనులను చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దీనికోసం ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గత ప్రభుత్వం పదేళ్ల పాటు PMAY-G నిధులను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల, పేదలకు సొంత ఇళ్ల కల నెరవేరలేదని సీఎం తెలిపారు. దీనివల్ల ప్రస్తుతం రాష్ట్రంలో ఇళ్ల కోసం తీవ్ర డిమాండ్ నెలకొందని స్పష్టం చేశారు. కేంద్రం రూపొందించిన ‘ఆవాస్ ప్లస్ (Awaas+)’ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించిందని, తెలంగాణ వ్యాప్తంగా 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించామని వివరించారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.
ఎల్నినో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా.. రైతులు, రైతు కూలీల జీవనోపాధి కోసం వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)లో అదనపు పనులను చేర్చాలని సీఎం కోరారు. రైతుల భూముల్లో కూరగాయల పందిళ్లు, పశుగ్రాసం పెంపకం, మల్బరీ సాగు, పట్టు పురుగుల షెడ్లు, వెదురు వనాల పెంపకాన్ని ఉపాధి పనుల్లో చేర్చాలన్నారు. కొండ వాలుల్లో నీటి నిల్వ కోసం కందకాలు, పండ్ల తోటల్లో తేమ రక్షణ చర్యలు, వరదలకు దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనులకు అనుమతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
గతంలో ఉన్నట్లుగానే.. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ సమయంలో 90 రోజుల వరకు ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు కల్పించే అవకాశం ఇవ్వాలని… స్థానిక అవసరాలకు తగ్గట్లు రాష్ట్రం ప్రతిపాదించే పనులకు అనుమతి ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేష్ షేట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, అలాగే ఉన్నతాధికారులు రామకృష్ణారావు, అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. .