ఎమ్మెల్యే ఎదుట దళిత సర్పంచ్ లకు అవమానం
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయ దుమారం రేపింది. గొల్లపల్లి, జోగాపూర్ గ్రామాల దళిత మహిళా సర్పంచ్‌లను అవమానించారంటూ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుకున్నారని, ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ ఘటన జరిగినా స్పందించలేదని మహిళా సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ వివాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ జాడి లక్ష్మి, జోగాపూర్ మహిళా సర్పంచ్‌ను కార్యక్రమానికి ఆహ్వానించినప్పటికీ, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించే సమయంలో మండలానికి చెందిన హరీష్ గౌడ్ తమను అడ్డుకున్నారని ఆరోపించారు.
దళిత మహిళా ప్రజాప్రతినిధులమైన తమను ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలోనే అవమానించారని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ ఘటనను అడ్డుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తమకు జరిగిన అవమానానికి ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్‌ను పట్టించుకోకపోతే ఆందోళనలు చేపట్టడంతో పాటు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని దళిత మహిళా సర్పంచ్‌లు హెచ్చరించారు.