రూ. 10 కోట్ల ధాన్యం బకాయిలు… రోడ్డెక్కిన రైతులు…
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించారు… కానీ ఇప్పటికీ కష్టార్జితానికి ప్రతిఫలం అందలేదు. కోట్ల రూపాయల బకాయిల కోసం రైతులు రోడ్డెక్కారు. వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగడమే కాకుండా ఇంట్లోని సామాగ్రిని బయటకు తీసి దహనం చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దండేపల్లి మండలానికి చెందిన రైతుల నుంచి సుమారు 10 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వ్యాపారి అక్కెనపల్లి శ్రీధర్, డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడని బాధిత రైతులు ఆరోపించారు. ఏడాది గడిచినా తమకు రావాల్సిన బకాయిలు అందకపోవడంతో ఆగ్రహించిన రైతులు సోమవారం వ్యాపారి ఇంటి వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఇంట్లోని కొన్ని వస్తువులను బయటకు తీసుకువచ్చి ఇంటి ముందు వేసి నిప్పంటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఇప్పటికీ డబ్బులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారి శ్రీధర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు రావాల్సిన మొత్తం బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం రైతులు ర్యాలీగా బయలుదేరి, వ్యాపారి శ్రీధర్‌కు రైస్‌మిల్ భాగస్వామిగా ఉన్న పాలకుర్తి రామన్న ఇంటి వద్దకు చేరుకుని ఆయనను నిలదీశారు. రైస్‌మిల్లులో శ్రీధర్‌కు ఉన్న వాటాకు సంబంధించిన డబ్బులను రైతులకు చెల్లించాలని, లేకపోతే రైస్‌మిల్లుకు తాళం వేస్తామని హెచ్చరించారు.
తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. వ్యాపారి పరారీలో ఉండగా… తమ కష్టార్జితానికి న్యాయం చేయాలంటూ రైతులు చేపట్టిన ఈ ఆందోళన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.