చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు న్యాయం ఎప్పుడు..?

BRS:దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో అకాల వర్షాల కారణంగా మృతి చెందిన నలుగురు రైతు కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్(BRS State leader Nadipelli Vijith Kumar) ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ వెంటనే అమలు చేసి ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలతో కలిసి ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో గత మే 6న కురిసిన అకాల వర్షాల వల్ల నలుగురు రైతులు మృతి చెందారని విజిత్ కుమార్ తెలిపారు. బాధిత రైతు కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో లక్షెట్టిపేట ఊట్కూర్ చౌరస్తాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి(Former Minister Jeevan Reddy), మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు(Former MLA Nadipelli Diwakar Rao) ఆధ్వర్యంలో రోజంతా ధర్నా నిర్వహించామన్నారు. ప్రభుత్వం తరఫున జిల్లా అదనపు కలెక్టర్ రాములు, మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారని, సంబంధిత లేఖ కూడా రెండు రోజుల్లో అందజేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

అయితే మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆరోపించారు. దీంతో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధిత కుటుంబాలతో కలిసి అదనపు కలెక్టర్‌కు మరోసారి వినతిపత్రం సమర్పించామ‌న్నారు. నష్టపరిహారం ఎప్పుడు అందిస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. నష్టపరిహారం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేయాలంటే ఎమ్మెల్యే నుంచి లేఖ అవసరమని అధికారులు చెప్పడం విచారకరమని, కానీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును అడగలేమని అధికారులు చెప్పడం మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని విజిత్ కుమార్ విమర్శించారు.

మంచిర్యాల ప్రజలపై, రైతులపై ఎమ్మెల్యేకు ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించిన ఆయన, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

 

You might also like