అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా సామ్రాజ్యం
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు
అటవీశాఖ అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారికి వ్యతిరేకంగా ఖానాపూర్ నియోజకవర్గంలోనే ఒక “వ్యతిరేక సామ్రాజ్యం” ఏర్పాటు చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలపై దాడి చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ… అవసరమైతే సహాయ నిరాకరణ ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆదివాసీలపై చేయి చేసుకున్న ఇంధన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తపాలాపూర్, ఉడుంపూర్, ఖానాపూర్ రేంజ్ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అటవీశాఖ అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే కవ్వాల్ టైగర్ జోన్ ప్రారంభమైన జన్నారం నుంచే అటవీశాఖకు వ్యతిరేక ఉద్యమానికి పునాది వేస్తామని హెచ్చరించారు.
అడవిలోకి ప్రజలను రానివ్వని అధికారులు… రెవెన్యూ భూముల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను కూడా తీసుకురాలేని పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యతిరేక సామ్రాజ్యం ఏర్పాటు చేయడంతో పాటు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, ఆ ఉద్యమాన్ని ఖానాపూర్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందు నాయక్, ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుదిరే వెంకట్‌తో పాటు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.