రాజకీయ దివాళాకోరుతనం
- విశ్వప్రసాద్, ఆత్రం సక్కు కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు
- నా పై ఆరోపణలు ఆదివాసీ సమాజాన్ని అవమానించడమే
- ఇది పార్టీ అధిష్ఠానాన్నే సవాల్ చేయడమే
- పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించే చర్యలను సహించను
- కాంగ్రెస్ వ్యక్తుల పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ
“నేను ఈ నేల బిడ్డనే.. నన్ను నాన్-లోకల్ అనడం దివాళాకోరుతనమని”డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దుయ్యబట్టారు. ఈ సందర్బంగా సుగుణ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను నాన్-లోకల్‌గా చిత్రీకరించడం రాజకీయ దివాళాకోరుతనమని, ఈ నేలపై పుట్టి పెరిగిన ఆదివాసి బిడ్డనైన తనపై అలాంటి వ్యాఖ్యలు చేయడం జిల్లా ప్రజలను, ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని ఆమె మండిపడ్డారు.
జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలిసి కొంతమంది కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి గాంధీభవన్‌కు తీసుకెళ్లి తనపై ఆరోపణలు చేయించారని ఆరోపించారు. ఇది పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం కాదని, కొందరు నాయకులు ఆడుతున్న రాజకీయ నాటకమని విమర్శించారు.
తాను సిర్పూర్-యూ మండలం పుల్లార గ్రామంలో జన్మించి ఈ జిల్లా మట్టిలోనే పెరిగానని, 1995లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచి అప్పటి నుంచి పార్టీ మారలేదని తెలిపారు. పార్టీ పట్ల తన నిబద్ధతను గుర్తించిన అధిష్ఠానం టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా, అనంతరం డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించడం అంటే పార్టీ అధిష్ఠానాన్నే సవాల్ చేయడమేనని వ్యాఖ్యానించారు.
పదవులు రాకపోవడంతో కొందరు నాయకులు అసంతృప్తిని పార్టీపైకి మళ్లిస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని, ప్రజల్లో కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీని బలోపేతం చేయాల్సిన వారే బలహీనపరిచే చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు.
తాను ఎవరిపైనా కక్షతో రాజకీయాలు చేయనని, అయితే పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించే చర్యలను సహించబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వ్యక్తుల పార్టీ కాదని, కార్యకర్తల పార్టీ అని పేర్కొన్న సుగుణక్క.. అధిష్ఠానం నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న వారిపై తగిన సమయంలో చర్యలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
చివరగా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా పార్టీ జెండా కింద ఐక్యంగా నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు