భట్టి సతీమణిపై సంచలన ఆరోపణలు.. గవర్నర్‌కు ఫిర్యాదు
తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందినిపై ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విశ్రాంత ఉద్యోగుల బకాయిల విడుదలలో కమిషన్ తీసుకుంటున్నారంటూ ఆరోపిస్తూ ఓ న్యాయవాది, సామాజిక కార్యకర్త గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందినిపై ఆరోపణలు చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు అందింది. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత ఎస్.కె. ప్రసన్నకుమారి చేసిన ఆరోపణల ఆధారంగా అడ్వకేట్, సామాజిక కార్యకర్త కరుపోతుల రేవంత్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఈ ఫిర్యాదు చేశారు. రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదలకు సంబంధించి నందిని భట్టి కమీషన్ డిమాండ్ చేశారనే ఆరోపణలు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ.40 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల కోసం 10 శాతం కమీషన్‌గా రూ.4 లక్షలు అడిగినట్లు ప్రసన్నకుమారి ఆరోపించారని తెలిపారు.
మెడికల్ అండ్ హెల్త్ శాఖలో సుమారు రూ.120 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి 6 నుంచి 10 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ ప్రసన్నకుమారి చేసిన ఆరోపణలను సైతం ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ప్రభుత్వం లేదా సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన, ఖండన వెలువడలేదని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.