దొంగను పట్టించిన ‘చీర’..
మూడేళ్ల తర్వాత బట్టబయలైన దొంగతనం!
నేరం చేసిన వాడు ఎంత తెలివిగా తప్పించుకున్నా.. ఏదో ఒక చిన్న ఆధారం వదిలిపెడతాడు అంటారు. కానీ ఇక్కడ దొంగలు ఏకంగా తాము దొంగిలించిన చీరను కట్టుకుని ఫంక్షన్‌కు వెళ్లి అడ్డంగా బుక్కయ్యారు. వినడానికి సినిమా కథలా అనిపించినా.. ఇది అక్షరాలా నిజం. మూడేళ్ల క్రితం జరిగిన ఓ ఇంటి దొంగతనం కేసును ఓ ‘చీర’ బట్టబయలు చేసింది.
బండ్లగూడ జాగీర్‌లోని వినాయకనగర్ ప్రాంతంలో నివసించే యాదయ్య కుటుంబం 2023 సెప్టెంబర్ 16న అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వెళ్లారు. మూడు రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 19న తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్న రెండున్నర లక్షల రూపాయల నగదు, 9 తులాల బంగారం, అలాగే కొన్ని ఖరీదైన చీరలను దొంగలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎంత గాలించినా దొంగల ఆచూకీ దొరకలేదు. అలా ఏకంగా మూడేళ్లు గడిచిపోయాయి.
కట్ చేస్తే.. ఇటీవల బాధితురాలు యాదయ్య భార్య వెళ్లిన ఓ ఫంక్షన్‌లో అనూహ్య పరిణామం ఎదురైంది. అదే ఫంక్షన్‌కు వాళ్ల ఇంటి వెనుక నివసించే స్వప్న అనే మహిళ కూడా వచ్చింది. అయితే స్వప్న కట్టుకున్న చీరను చూసిన యాదయ్య భార్య ఒక్కసారిగా అవాక్కైంది. అది మూడేళ్ల కిందట తన ఇంట్లో దొంగతనానికి గురైన చీరగా ఆమె పక్కాగా గుర్తుపట్టింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
బాధితురాలి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్వప్నతో పాటు ఆమె భర్త రాములును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తొలుత ఆ చీర తనదేనంటూ స్వప్న బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించే సరికి అసలు నిజం కక్కక తప్పలేదు. మూడేళ్ల క్రితం యాదయ్య ఇంట్లో దొంగతనం చేసింది తామేనని స్వప్న, రాములు దంపతులు అంగీకరించారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని కేసును.. ఓ చీర పట్టించడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చూశారు కదా.. తెలిసిన వాళ్లే కదా, పొరుగింటి వాళ్లే కదా అని గుడ్డిగా నమ్మితే ఎలాంటి మోసాలు జరుగుతాయో ఈ ఘటనే ఓ ఉదాహరణ. దొంగలు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.