కోటి మంది యువతకు ఏఐ శిక్షణ

ఎర్రకోటపై మోదీ ప్రకటన..

ప్రపంచ సాంకేతిక మార్పులకు అనుగుణంగా యువతను సిద్ధం చేసేందుకు వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. స్టార్టప్‌లు, కొత్త ఆవిష్కరణలకు మరింత ఊతమిచ్చేందుకు రూ.లక్ష కోట్ల ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘వికసిత భారత్–2047’ లక్ష్యంగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్న ప్రధాని.. దేశ యువతే ఈ ప్రగతికి ప్రధాన చోదక శక్తి అని అన్నారు. ఆత్మనిర్భర భారత్, సాంకేతిక స్వావలంబన, ఇంధన భద్రత, మౌలిక వసతుల విస్తరణపై కీలక ప్రకటనలు చేశారు.

వికసిత భారత్–2047 లక్ష్యం
2047 నాటికి భారత్‌ను పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. గత సంవత్సరాల్లో కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. దేశంలో మౌలిక వసతులు, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీరు, గ్యాస్ కనెక్షన్లు, మెట్రో రైలు వంటి సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. సంకల్పం దృఢంగా ఉంటే కఠిన సవాళ్లను కూడా అధిగమించవచ్చని అన్నారు. ఉన్నతమైన కలలు, బలమైన సంకల్పం ఉంటే దేశ సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని చెప్పారు.

 

You might also like