ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు
నిరుద్యోగులకు ముఖ్యమంత్రి హామీ
Chief Minister Revanth Reddy:ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ప్రకటించారు. ప్రభుత్వంలోని ప్రతి ఖాళీని భర్తీ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల(Smart ration cards) పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొందరు నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఉన్నవీ లేనివీ చెప్పే వారి మాయలో పడకండి… అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశ ఆరు. ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది… ఏ ఖాళీలను గాలికి వదిలేయం. పోటీ పరీక్షలకు సిద్ధం కండి. అన్ని పరీక్షలు నిర్వహించే బాధ్యత నాదంటూ ఆయన యువతకు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు, ప్రధానంగా రైతులు, మహిళలు, యువత ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. “గడిచిన 32 నెలల కాలంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ. 90 వేల కోట్లు చెల్లించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని చెప్పారు. రూ. 21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి 25 లక్షల మంది రైతులను అప్పుల నుంచి విముక్తి చేశామని స్పష్టం చేశారు. దేశంలోనే అతితక్కువ అప్పులున్నది తెలంగాణ రైతాంగం అని కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయని రేవంత్ రెడ్డి చెప్పారు.
రైతు భరోసా ఎకరాకు 12 వేలు పెంచి రూ. 36 వేల కోట్లు రైతు భరోసా కింద అందించామన్నారు. రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని… వ్యవసాయాన్ని పండుగ చేశాం. రైతులను రాజులా గౌరవించే సంస్కృతి మా ప్రభుత్వానిదంటూ సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు, తప్పులకు వడ్డీ కడుతూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు. ప్రతి ఏటా రూ. 75 వేల కోట్లు అప్పులకు చెల్లిస్తున్నాం. ప్రజల ఆశీర్వాదముంటే సాధించలేనిది ఏదీ లేదు. మీకు ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం” అని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు.